సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్లో అతి పెద్ద హిట్లలో పడయప్పా ఒకటి. రజినీని దక్షిణాదిన సిసలైన సూపర్‌స్టార్‌గా మార్చిన సినిమా ఇదే అని చెప్పొచ్చు. అంతకుముందు కూడా రజినీకి ఇతర భాషల్లో ఫాలోయింగ్, మార్కెట్ ఉన్నాయి కానీ.. ఈ చిత్రంతో అవి మరో స్థాయికి చేరాయి. పడయప్పాను తెలుగులో నరసింహ పేరుతో రిలీజ్ చేస్తే ఇక్కడ టాప్ స్టార్ల సినిమాలతో సమానంగా వసూళ్లు రాబట్టింది. దాదాపుగా అన్ని ప్రధాన సెంటర్లలో వంద రోజులు ఆడింది. ఇప్పుడు రజినీ సినీ స్వర్ణోత్సవం (50 ఏళ్లు) జరుగుతున్న వేళ పడయప్పాను తమిళనాట పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు. ఆ సినిమా రిలీజై కూడా పాతికేళ్లు పూర్తవడంతో డిసెంబరు 12న రజినీ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ స్పెషల్ మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు కథ అందించడమే కాక నిర్మాణంలోనూ భాగస్వామి అయ్యాడు రజినీ. దీంతో ఆయన కూతుళ్లే ఈ చిత్ర రీ రిలీజ్ పనులను స్వయంగా చూసుకున్నారు. దీని ప్రమోషన్లో భాగంగా రజినీ ఒక వీడియో బైట్ కూడా ఇచ్చారు. అందులో ఆయన పడయప్పా సీక్వెల్ ప్రస్తావన తేవడం విశేషం.
''పడయప్పా నా కెరీర్లో చాలా స్పెషల్ ఫిలిం. ఒక సినిమాకు మహిళలు గేట్లు తోసుకుని, విరగ్గొట్టుకుని థియేటర్లలోకి వెళ్లి చూడడం పడయప్పా విషయంలోనే జరిగింది. అప్పట్లో ఈ సినిమాను గొప్పగా ఆదరించారు. ఇది థియేటర్లలో మాత్రమే చూసి ఆస్వాదించాల్సిన సినిమా. అందుకే మేం ఈ చిత్ర శాటిలైట్, డిజిటల్ హక్కులను ఎవ్వరికీ ఇవ్వలేదు. సన్ టీవీలో మాత్రమే రెండుసార్లు ప్రసారమైనట్లుంది. థియేటర్లలో మాత్రమే ఎంజాయ్ చేయదగ్గ సినిమా కావడంతో నా పుట్టినరోజు నాడు ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నాం. పడయప్పా సీక్వెల్ గురించి ఎప్పట్నుంచో చర్చలు నడుస్తున్నాయి. ఆ సినిమాలో ఇంకో జన్మ ఎత్తి అయినా నీ మీద ప్రతీకారం తీర్చుకుంటా అని నీలాంబరి పాత్ర అంటుంది. ఆ ఆలోచనతోనే నీలాంబరి పేరుతో సీక్వెల్ తీయడం గురించి ఆలోచిస్తున్నాం. డిస్కషన్ నడుస్తోంది. కథను బట్టి ఈ సినిమాను తీయడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు అభిమానులు నా పుట్టిన రోజున పడయప్పా సినిమాను చూసి ఎంజాయ్ చేయండి'' అని రజినీ అన్నారు.