వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మాస్టర్ స్ట్రోక్ తగలబోతుందా..? పార్టీకి కీలక ఫ్యామిలీ గుడ్‌బై చెప్పబోతుందా..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. 2024 ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అయ్యింది. కానీ క్షేత్రస్థాయిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం పుంజుకోకపోగా.. రోజురోజుకు మరింత బలహీనపడుతోంది. ఈ పరిస్థితిలో ఆయన వెన్నంటి నడిచిన పలు కుటుంబాలు బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ లిస్ట్‌లో ఇప్పుడు ఆళ్ల ఫ్యామిలీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వైసీపీ ఆవిర్భావం నుండి పార్టీకి మద్దతుగా పనిచేశారు. ఆయన సోదరుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా పార్టీలో చేరి క్షేత్ర స్థాయిలో కీలక పాత్ర పోషించారు. 2014 ఎన్నికల్లో అయోధ్య రామిరెడ్డి నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అదే సమయంలో రామకృష్ణారెడ్డి మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు. 2019 ఎన్నికల్లో అయోధ్య రామిరెడ్డికి టికెట్ కేటాయించలేదు. రామకృష్ణారెడ్డి మంగళగిరి నుంచి రెండోసారి గెలిచారు. ఆ ఎన్నికల్లో వైసీపీ కూడా అధికారంలోకి రావడంతో.. రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఖాయమని అనుకున్నారు. కానీ జగన్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. అయితే ఆళ్ల అయోధ్య రామిరెడ్డిని 2020లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు పంపినప్పటికీ.. క్షేత్ర స్థాయి ఆధిపత్యం మాత్రం ఇవ్వలేదు.
ఇక ఆళ్ల రామకృష్ణారెడ్డి 2014 - 2019 మధ్య విపక్షంలో ఉన్న పార్టీని ముందుకు నడిపించడంలో ముఖ్య పాత్ర పోషించారు. అందుకు ప్రతిఫలంగా ఆయనకు మంత్రి పదవి దక్కక పోగా.. 2024 ఎన్నికల్లో టికెట్ కూడా ఇవ్వనని జగన్ మొండి చెయ్యి చూపించారు. దాంతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఆళ్ల రామకృష్ణారెడ్డి 2023 డిసెంబర్ 10న ఎమ్మెల్యే పదవికి వైసీపీకి రాజీనామా చేసి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అయితే కొద్ది రోజులకే ఆయన్ను తిరిగి వైసీపీలోకి రప్పించారు. కట్ చేస్తే 2024 ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలైంది. వైసీపీ ఓడిన తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎటువంటి పార్టీ బాధ్యతలు అప్పగించలేదు. ఇంకోవైపు అయోధ్య రామిరెడ్డి రాజ్యసభ పదవీకాలం వచ్చే 2026 జూన్ లో ముగియనుంది. ఈ నేపథ్యంలో, ఆళ్ల ఫ్యామిలీ వైసీపీకి గుడ్‌బై చెప్పే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే జగన్‌కు వ్యూహాత్మకంగా ఒక మాస్టర్ స్ట్రోక్ అవుతుంది అనడంలో సందేహం లేదు.