పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులతో ఆ శాఖా మంత్రి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. శాఖాపరమైన సమస్యలను పవన్ కు ఉద్యోగులు, అధికారులు వివరించారు. పంచాయతీ కార్యదర్శులను పంచాయతీ అభివృద్ధి అధికారులుగా మార్చడంపై పవన్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న తమకు ప్రమోషన్లు లభించడంపై హర్షం వ్యక్తం చేశారు. అయితే, సొంత మండలంలో పంచాయతీ కార్యదర్శులు పని చేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ, సచివాలయ ఉద్యోగులను పంచాయతీ విభాగం నుంచి వేరు చేయాలని కోరారు.
పల్లెలు దేశానికి వెన్నెముక అని, అందుకే పంచాయతీరాజ్ శాఖను తీసుకున్నానని పవన్ అన్నారు. గత ప్రభుత్వంలో ప్రతి పోస్ట్ కు, బదిలీకి, ప్రమోషన్ కు రేటు పెట్టారని, ఆ పద్ధతిని పూర్తిగా నిర్మూలించామని అన్నారు. పనులు చేసిన కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించాలని ఆదేశించారు. పదివేల మందికి పదోన్నతులు కల్పించామని, వారి ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొందని చెప్పారు. జీతాలు పెరగాలంటే రాష్ట్ర ఆదాయం పెరగాలని, ఆదాయం పెంపుపై అధికారులు దృష్టి సారించాలని పవన్ అన్నారు.