తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కొందరు విద్యార్థులు నినాదాలు చేశారు. సీఎం డౌన్ డౌన్...అని కొందరు నినాదాలు చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత రేవంత్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంతకుముందు, వర్సిటీలో సౌకర్యాలు, మౌలిక సదుపాయాల కోసం మరిన్ని నిధులు కేటాయిస్తామని రేవంత్ అన్నారు. ఇప్పటికే రూ.1000కోట్లు ప్రకటించామని తెలిపారు.
ఆర్ట్స్ కాలేజీ ముందు నిలబడి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవాలని ఉందని చెప్పారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చింది ఉస్మానియా యూనివర్సిటీ అని కొనియాడారు. యూనివర్సిటీకి రావాలంటే ధైర్యం అక్కరలేదని, అభిమానం ఉండాలని అన్నారు. ఆర్ట్స్ కాలేజీ ముందు నిలబడి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవాలనుందని చెప్పారు.
ఉస్మానియా యూనివర్సిటీకి గొప్ప చరిత్ర ఉందని, వర్సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతానని హామీనిచ్చారు. విద్యార్థులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేందుకే ఇక్కడకు వచ్చానని వ్యాఖ్యానించారు. ఉస్మానియా వర్సిటీలో పర్యటిస్తానని గతంలో రేవంత్ అన్నారు. అన్నమాట ప్రకారమే నేడు పర్యటించారు. వర్సిటీలో రేవంత్ పర్యటించడం రెండోసారి. అయితే, కొందరు విద్యార్థులు రేవంత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం చర్చనీయాంశమైంది.