తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకల హుండీ పరకామణిలో 2021లో దొంగతనం జరిగిన విషయం తెలిసిందే. రవికుమార్ అనే ఇంచార్జ్ అధికారి పరకామణి సొమ్ము లెక్కింపు సందర్భంగా విదేశీ డాలర్లను లోడ్రస్‌లో పెట్టుకుని చోరీ చేశారు. వీటి విలువ సుమారు 70 వేల రూపాయలు ఉంటుందని అధికారులు లెక్కతేల్చారు. అయితే.. ఈ చోరీని గుర్తించిన.. అప్పటి టీటీడీ విభాగంలో పనిచేసిన సతీష్‌కుమార్ అనే సీఐ.. ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయింది. అనంతర కాలంలో ఈ కేసును లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించారు. రవికుమార్ ఆ సమయంలో తన ఆస్తిలో 14 కోట్ల రూపాయలను స్వామి వారికి ఇచ్చారు.
అయితే.. శ్రీవారి పరకామణి కేసులో రాజీ కుదుర్చుకోవడం ఏంటని తిరుపతికి చెందిన ఓ పాత్రికేయుడు.. హైకోర్టులలో పిల్ వేశారు. దీంతో కేసు తిరగదోడారు. తాజాగా బుధవారం నాటి విచారణలో హైకోర్టు.. చట్టం ప్రకారం.. నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.ఇదిలావుంటే..ఈ కేసు చుట్టూ రాజకీయాలు ముసురుకున్నాయి. శ్రీవారి సంపదను కొల్లగొట్టడం, పైగా రాజీ పడడాన్ని భక్తులు సహించలేక పోతున్నారు. దీంతో సర్కారు కూడా సిట్‌ను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా దర్యాప్తు చేయిస్తోంది. అయితే.. ఇటీవల వైసీపీ అధినేత, ఈ కేసు జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ స్పందించారు.
``పరకామణి కేసులో ఏముంది. ఆయన 70 వేలు `తీసుకున్నాడు`. తప్పని తెలిసి.. ఆయన ఆస్తిలో 14 కోట్లు ఇచ్చేశాడు. దీనికి కేసు ఎందుకు.. పెట్టారంటే .. రాజకీయం చేయాలని. మా పార్టీ నేతలను ఇరికించాలని`` అని జగన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారానికి దారితీశాయి.ఇప్పటికే సీఎం చంద్రబాబు జగన్‌ను తీవ్రంగా తప్పుబట్టారు. పెద్ద పెద్ద నేరాలు చేసేవారికి శ్రీవారి సొమ్ము అపహరణ చిన్న విషయమేనని ఎద్దేవారు. ఇక, పలువురు నాయకులు కూడా ఇదే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ క్రమంలో తాజాగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తొలిసారి ఈ వ్యవహారంపై స్పందించారు.
``తాను పాటిస్తున్న మతంలో ఇలాంటి ఘటనలు జరిగితే.. ఆయన(జగన్) ఇలానే స్పందిస్తారా?`` అని పవన్ ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం.. అన్ని మతాలు సమానమేనని.. కానీ, హిందూ ధర్మంపై ఇతర మతాల వారు దాడి చేస్తున్నారని చెప్పారు. ఇస్లాం, క్రైస్తవ మతాలకు ఒకలా, హిందూ మతానికి మరోలా నిబంధనలు ఉండకూడదన్నారు. హిందువులు వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన మతంలో కూడా దేవుడి ఆస్తులను దొంగిలిస్తే.. ఆ మనిషి ఇలానే వ్యాఖ్యానిస్తా రా? శ్రీవారి సొమ్ము అంటే.. అంత తేలిక అయిపోయిందా? అని ప్రశ్నించారు. ఎంతో దూరాల నుంచి వచ్చే భక్తులు రూపాయి సమర్పించినా.. శ్రీవారి ఆస్తిలో భాగమేనని.. చెప్పారు.