ఏపీ విపక్షం వైసీపీ సంచలన ప్రకటన చేసింది. నిన్న మొన్నటి వరకు తమ వాడేనని వైసీపీ నాయకులు కొందరు చెబుతూ వచ్చిన.. రౌడీ షీటర్, గుంటూరుకు చెందిన వివాదాస్పద నాయకుడు బోరగడ్డ అనిల్‌కుమార్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని తాజాగా బుధవారం సాయంత్రం వైసీపీ ప్రకటన జారీ చేసింది. ``బోరగడ్డ అనిల్‌కుమార్ అనే వ్యక్తి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయనకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదు`` అని పార్టీ వివరించింది.
అంతేకాదు.. బోరగడ్డ అనిల్ కుమార్.. వైసీపీ నాయకుడు అంటూ ఇటీవల కొన్ని మీడియా ఇంటర్వ్యూల్లోనూ, సోషల్ మీడియా వేదికలపై కనిపించడం, ప్రస్తావించడం, ఆపాదించడం జరుగుతోందని, వీటిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని ఆ పార్టీ వెలువరించిన ప్రకటనలో స్పష్టం చేసింది. బోరగడ్డ అనిల్‌కుమార్ అనే వ్యక్తితో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేస్తున్నామని తెలిపింది. అయితే.. బోరగడ్డ అనిల్ కుమార్ జైలుకు వెళ్లముందు.. తాను జగన్ అభిమానినని.. వైసీపీ తరఫున పనిచేస్తున్నానని చెప్పడం గమనార్హం.
ఎవరీ బోరగడ్డ..
ఖచ్చితంగా ఏడాది కిందట.. గత ఏడాది నవంబరు-డిసెంబరులో ఏపీలో ప్రముఖంగా వినిపించిన పేరు బోరగడ్డ అనిల్‌కుమార్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. అప్పటి విపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు, ప్రస్తుత మంత్రి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సహా వారి కుటుంబాలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతేకాదు.. సవాళ్లు కూడా రువ్వారు. తీవ్ర దుర్భాషలాడారు. అయితే.. అప్పట్లోవైసీపీ ఈ పరిణామాలను లైట్ తీసుకుంది. కాగా.. గతంలోనే బోరగడ్డపై రౌడీషీట్ ఉండడం గమనార్హం.
ఇక, రాష్ట్రంలో గత ఏడాది కూటమి అధికారంలోకి వచ్చాక.. సోషల్ మీడియాలో దుర్భాషలాడిన వారిపై తీవ్ర స్థాయిలో ఉక్కు పాదం మోపారు. ఈ క్రమంలోనే బోరగడ్డపై కూడా కేసులు పెట్టి అరెస్టు చేశారు. అనంతరం జైలుకు తరలించారు. అయితే.. తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని.. బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించి బోరగడ్డ బెయిల్ తెచ్చుకున్నారు. కానీ, ఈ క్రమంలో నకిలీ వైద్యులు ఇచ్చిన సర్టిఫికెట్లను కోర్టుకు సమర్పించినట్టు పోలీసులు గుర్తించి.. విషయాన్ని కోర్టుకు చెప్పారు. దీంతో మరో కేసు నమోదైంది. ఈ పరిణామాలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహంవ్యక్తం చేసి.. తక్షణ అరెస్టుకు ఆదేశించింది. ప్రస్తుతం విశాఖజైల్లో బోరగడ్డ ఉండడం గమనార్హం.
ఆది నుంచి వైసీపీనే..
ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బోరగడ్డ అనిల్‌కుమార్ ఆది నుంచి వైసీపీలోనే ఉన్నారని.. గతంలో వైసీపీ నేతలే చెప్పారు. జగన్ విజయానికి సోషల్ మీడియా ద్వారా ఆయన ప్రచారం కూడా చేశారని చెప్పారు. ఇక, ఆయన అరెస్టు అయినప్పుడు కూడా.. నాయకులు స్పందించి.. అక్రమ కేసులు పెట్టారని వాదించారు. కానీ, తాజాగా అదే బోరగడ్డ అనిల్‌కు తమకు సంబంధం లేదని పేర్కొంటూ.. పార్టీ సంచలన ప్రకటన విడుదల చేయడం గమనార్హం.