ఈ ఏడాది ఆరంభంలో ‘ఛావా’.. మధ్యలో ‘సైయారా’ చిత్రాలతో బాలీవుడ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత హిందీలో మళ్లీ అలాంటి సెన్సేషన్ అంటే.. ‘దురంధర్’ మూవీనే. ‘యురి’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆదిత్య ధర్.. చాలా గ్యాప్ తీసుకుని స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. బడ్జెట్ ఏకంగా రూ.350 కోట్లు. ఐతే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. బంపర్ ఓపెనింగ్సూ వచ్చాయి. రెండో వీకెండ్లోనూ సినిమా బలంగా నిలబడుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్లలో ఒకటిగా నిలవబోతోంది ‘దురంధర్’.
ఐతే ఈ సినిమాపై ప్రశంసలతో పాటు విమర్శలూ వస్తున్న మాట వాస్తవం. పాకిస్థాన్ మీదే కాక ముస్లింల పైనా ద్వేషం పెంచేలా సినిమా ఉందని.. కొన్ని విషయాలను బాగా ఎగ్జాజరేట్ చేశారని.. ఇది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రాయోజిత చిత్రమని ఒక వర్గం విమర్శలు గుప్పిస్తోంది. అలా మాట్లాడే వాళ్లను ఇంకో వర్గం గట్టిగా టార్గెట్ చేస్తోంది. వారం రోజులుగా ఈ ఘర్షణ కొనసాగుతోంది.
ఈ గొడవలోకి ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన హృతిక్ రోషన్ వచ్చాడు. అతను ‘దురంధర్’ సినిమా మీద తన అభిప్రాయాన్ని చెబుతూ ఒక పోస్టు పెట్టాడు. క్రాఫ్ట్, మేకింగ్ పరంగా ఈ సినిమా ఒక అద్భుతం అని కొనియాడుతూనే.. ఇంకోవైపు తన అభ్యంతరాలను వెల్లడించాడు హృతిక్.
ఇందులో రాజకీయ అంశాలతో తాను ఏకీభవించనని.. ఫిలిం మేకర్స్‌గా బాధ్యతతో వ్యవహరించాలని అతను కామెంట్ చేశాడు. దీని మీద సోషల్ మీడియాలో దుమారం రేగింది. ఇది బీజేపీ ప్రాపగండా మూవీ అని హృతిక్ చెప్పకనే చెప్పాడంటూ ఒక వర్గం అతణ్ని కొనియాడుతోంది. ఈ విషయంలో ఇంకో వర్గం హృతిక్ మీద విమర్శలు గుప్పించడం మొదలుపెట్టింది. ఒకవైపు సినిమా నచ్చిందని అంటూ.. ఇవేం సన్నాయి నొక్కులు అంటూ అతడి మీద మండిపడింది. నెగెటివ్ కామెంట్లు తీవ్ర స్థాయిలో రావడంతో హృతిక్ అలెర్ట్ అయ్యాడు. ‘దురంధర్’ తన మైండ్ నుంచి పోవట్లేదంటూ ఇంకోసారి ఆ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తూ ఇంకో పోస్టు పెట్టాడు. ఈసారి నెగెటివ్ కామెంట్లేవీ చేయలేదు. మొదటి ట్వీట్ విషయంలో జరిగిన డ్యామేజ్‌ను సరి చేయడానికే అతనీ పోస్టు పెట్టినట్లు కనిపిస్తోంది.