నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే థియేటర్లలో పండగ వాతావరణం. ఆ మాస్ అంచనాలను మరోసారి నిజం చేస్తూ తెరకెక్కిన చిత్రం ‘అఖండ 2: తాండవం’. బాలయ్య అఘోరా గెటప్, పవర్‌ఫుల్ డైలాగ్స్, ఆధ్యాత్మిక టచ్‌తో సినిమా ఊహించని రేంజ్‌లో స్పందన తెచ్చుకుంటోంది. అయితే ఈ సినిమాలో బాలయ్యతో పాటు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన మరో కీలక పాత్ర ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
సినిమాలో పరమేశ్వరుడి పాత్రలో కనిపించిన నటుడు తరుణ్ ఖన్నా. సాధారణంగా బాలయ్య స్క్రీన్‌పై ఉన్నప్పుడు ఇతర పాత్రలు వెనకబడిపోతాయి. కానీ ‘అఖండ 2’లో ప్రళయ కాల రుద్రునిగా తరుణ్ ఖన్నా ఇచ్చిన పెర్ఫార్మెన్స్ మాత్రం బాలయ్య స్థాయికి తగ్గట్టు ఉండటమే కాదు… ఒకానొక టైమ్‌లో ఆయననే డామినేట్ చేశారనే మాట వినిపిస్తోంది. దీంతో తరుణ్ ఖన్నా గురించి సినీ ప్రియులు ఆరాలు తీయడం ప్రారంభించారు.
తరుణ్ ఖన్నా పేరు తెలుగులో పెద్దగా వినిపించకపోయినా, హిందీ బుల్లితెర ప్రేక్షకులకు మాత్రం ఆయన సుపరిచితుడు. ముఖ్యంగా మైథలాజికల్ సీరియల్స్‌లో శివుడిగా ఆయనకు మంచి అనుభవం ఉంది. టీవీ సిరీస్ ‘సంతోషి మా’ (2015 - 17)లో మొదటిసారి శివునిగా నటించారు తరుణ్ ఖన్నా. ఆ తర్వాత ‘కర్మఫల్ దాత శని’, ‘పరమావతార్ శ్రీ కృష్ణ’, ‘శ్రీమద్ రామాయణ’ వంటి సీరియల్స్‌లో శివుడిగా నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇకపోతే మొదటి భాగం ‘అఖండ’లో శివ తత్వం ప్రతీకాత్మకంగా ఉంటే, ఈ సీక్వెల్‌లో ఆ భావనను మరింత బలంగా చూపించారు బోయపాటి. ముఖ్యంగా శివుడి ఎంట్రీ సీన్, ఆయన సంభాషణలు, ముఖాభినయం సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. కథలో కీలకమైన ఒక ఎమోషనల్ సన్నివేశంలో శివుడే స్వయంగా భూమిపైకి వస్తాడు. థియేటర్లలో ఆ సన్నివేశానికి వస్తున్న రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. అందులోనూ తరుణ్ ఖన్నా శివుడిగా కనిపించడం వల్ల ఉత్తరాది ప్రేక్షకులకు సినిమా మరింత కనెక్ట్ అవుతోంది. ఇప్పటికే టీవీ సీరియల్స్ ద్వారా ఆయనకు అక్కడ మంచి ఫాలోయింగ్ ఉండటంతో, ‘అఖండ 2’ పాన్-ఇండియా రీచ్‌కు ఇది అదనపు బలంగా మారింది.