సరైనోడి చేతిలో అధికారం.. పాలనా పగ్గాలు ఉంటే పరిస్థితులు ఎలా ఉంటాయన్న విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి నిరూపించారు. వ్యక్తులుగా స్పందించటం వేరు.. వ్యవస్థలు రియాక్టు కావటం వేరు. వ్యక్తులు స్పందించినా.. వ్యవస్థలు అంత వేగంగా రియాక్టు కావు.
అందుకు భిన్నంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తాను స్పందించటమే కాదు.. తన నోటి మాటతో పాలనా వ్యవస్థల్ని పరుగులు తీసేలా చేసిన వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఉదయం తన ముందుకు వచ్చిన వినతిని.. సాయంత్రానికి పాలనా అనుమతులు జారీ అయ్యే వేగం చూస్తే.. సరైనోడి చేతిలో అధికారం ఉందన్న ఆనందానికి గురి కాకుండా ఉండలేం.
అంధ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక అండ్ టీం సభ్యులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలవటం.. ఈ సందర్భంగా వారికి తన నుంచి అందాల్సిన సాయాన్ని అందించటం తెలిసిందే. ఈ సందర్భంగా తమ ఊరికి రోడ్డు లేదని.. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని.. తమ సమస్యను పరిష్కరించాలన్న జట్టు కెప్టెన్ దీపిక మాటకు కదిలిపోయిన పవన్ కల్యాణ్ ఆ జిల్లా కలెక్టర్ తో మాట్లాడి.. రోడ్డు సమస్యను తీర్చాలని ఆదేశించారు.
ఉదయం పవన్ నుంచి వచ్చిన ఫోన్ కు సత్యసాయి జిల్లా కలెక్టర్, అధికారులు వాయు వేగంతో రియాక్టు అయ్యారు. అప్పటికప్పుడు దీపిక సొంతూరు మడకశిర నియోజకవర్గంలోని అమరాపురం మండలం హేమవతి పంచాయితీ పరిధిలోని తంబాలహట్టి రోడ్డును పరిశీలించటమే కాదు.. రోడ్డు నిర్మాణానికి అయ్యే ఖర్చును లెక్కేశారు. హేమావతి నుంచి తంబాలహట్టి వరకు రోడ్డు వేసేందుకు రూ.3.20 కోట్లు.. గున్నేహళ్లి నుంచి తంబాలహట్టి వరకు ఐదు కిలోమీటర్ల దూరాన ఉన్న రోడ్డు నిర్మాణానికి రూ.3 కోట్లు అవసరమని అంచనాలు వేశారు.
వీరి లెక్కలకు జిల్లా కలెక్టర్ పరిశీలించి.. శుక్రవారం సాయంత్రమే పరిపాలనా అనుమతులు జారీ చేసిన వైనం ఆసక్తికరంగా మారింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చిన వినతిని వాస్తవంలోకి తీసుకొచ్చేందుకు పనులు పూర్తి చేసేందుకు అధికారులు జెట్ స్పీడ్ తో పని చేసిన వైనం అందరూ మాట్లాడుకునేలా చేస్తోంది. పవన్ పవర్ కు ఫిదా అవుతున్న పరిస్థితి. రోజులోనే వినతి.. పాలనా అనుమతులు జారీ అయిన నేపథ్యంలో వారం.. పది రోజుల్లోపు రోడ్డు నిర్మాణం కూడా పూర్తి అయితే బాగుండు. మరేం జరుగుతుందో చూడాలి.