నటసింహం బాలయ్య, దర్శకుడు బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో వచ్చిన అఖండ-2.. భారీ ప్రజాదరణ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్)నుంచి కూడా ఆశీర్వాదం లభించడం విశేషం. హిందూత్వను ప్రమోట్ చేస్తున్న ఆర్ ఎస్ ఎస్ సాధారణంగా సినిమాల విషయంపై ఎప్పుడూ స్పందించింది లేదు. కానీ, తొలిసారి అఖండ-2 మరింత దూసుకుపోవాలని ఆకాంక్షించడం గమనార్హం. ``నేటి తరానికి దేశం, ధర్మం, దైవ భావనలను తెలియజేసే అఖండ-2.. అఖండ విజయం సాధించాలి`` అని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు.
ఆర్ ఎస్ ఎస్ చీఫ్‌ను తాజాగా దర్శకుడు బోయపాటి శ్రీను కలుసుకున్నారు. అఖండ-2 కథను ఆయనకు వివరించారు. దీనికి ఆయన సంతోషం వ్యక్తం చేయడంతోపాటు.. హైంధవ ధర్మం కాపాడడంతోపాటు.. సమాజానికి సానుకూల దిశను చూపించే, విలువలతో కూడిన చిత్రాలను నిర్మించాలని మోహన్ భాగవత్ సూచించారు. దర్శకుడు బోయపాటి కృషిని.. ఆయన అభినం దించారు. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ.. సనాతన ధర్మానికి ప్రతీక అయితే.. దేశం, ధర్మం, దైవం వంటి మూలాలను నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే అఖండ-2ను నిర్మించామని చెప్పారు.
ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ నుంచి తమకు ఆశీర్వాదం లభించడం చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు. ఇది తమకు మరింత బాధ్యత పెంచిందని కూడా చెప్పారు. మోహన్ భాగవత్‌ను కలుసుకోవడం.. గొప్ప విషయంగా తెలిపిన బోయపాటి.. ఆయన నుంచి ఎంతో స్ఫూర్తి పొందుతున్నట్టు పేర్కొన్నారు. కాగా.. అఖండ-2 మూవీ జననీరాజనాలు అందుకుంటున్న విషయం తెలిసిందే. దేశ విదేశాల్లోనూ ఈ సినిమా దూసుకుపోతోంది. ఉత్తరాదిలోనూ తొలిసారి రికార్డులు సృష్టించింది. అన్ని వివాదాలు పరిష్కరించుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చిన `అఖండ-2`.. యువతను ఉర్రూతలూగిస్తున్న విషయం తెలిసిందే.