ఆంధ్రప్రదేశ్‌లో సైబర్ నేరగాళ్లు హద్దులు దాటుతున్నారు. రోజురోజుకూ కొత్త కొత్త మోసాలతో అమాయకుల్ని వలలోకి లాగుతూ కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో ఏకంగా రూ.751.40 కోట్లు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయినట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌కు ఏపీ నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు 57,673 ఫిర్యాదులు నమోదవ్వడం గమనార్హం. అంటే రోజుకు సగటున వేల మందికి పైగా సైబర్ మోసాలకు గురవుతున్నట్లు స్పష్టమవుతోంది.
గంటకు రూ.8.54 లక్షల నష్టం..
ఈ గణాంకాలను పరిశీలిస్తే మరింత భయంకరమైన నిజాలు బయటపడుతున్నాయి. ఏపీలో సగటున గంటకు రూ.8.54 లక్షలు, రోజుకు దాదాపు రూ.2.05 కోట్లు సైబర్ మోసాల ద్వారా బాధితులు కోల్పోతున్నారు. డిజిటల్ అరెస్టులు, క్రెడిట్–డెబిట్ కార్డ్ మోసాలు, ఓటీపీ స్కామ్స్, క్రిప్టోకరెన్సీ పెట్టుబడులు, వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో మోసాలు, ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్స్, న్యూడ్ వీడియో కాల్స్ లాంటి ట్రాప్స్‌తో నేరగాళ్లు జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారు.
ఇంత భారీగా నష్టం జరిగినా బాధితులకు తిరిగి వచ్చిన డబ్బు మాత్రం అతి స్వల్పం. మొత్తం పోయిన డబ్బులో కేవలం రూ.2.21 కోట్లు (0.29 శాతం) మాత్రమే అధికారులు రికవరీ చేయగలిగారు. అంటే బాధితులు కోల్పోయిన మొత్తంలో ఒక్క శాతం కూడా వెనక్కి రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే మరోవైపు రూ.89 కోట్లు (11.84 శాతం) మాత్రం నేరగాళ్ల ఖాతాల్లోకి వెళ్లకుండా బ్యాంకు అకౌంట్లను సమయానికి నిలిపివేయగలిగారు. ఇది కొంత ఊరట కలిగించే అంశమే అయినా, మొత్తం నష్టంతో పోలిస్తే చాలా తక్కువగానే కనిపిస్తోంది.
సైబర్ నేరగాళ్లు బాధితుల ఖాతా నుంచి డబ్బు వచ్చిన క్షణాల్లోనే ఆ మొత్తాన్ని వందల ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ‘మ్యూల్ అకౌంట్స్’ నెట్‌వర్క్‌లను, కమీషన్లతో పనిచేసే టీమ్‌లను ఏర్పాటు చేసుకుంటున్నారు. చాలా మంది నేరగాళ్లు విదేశాల్లో ఉంటూ, స్థానిక ఆపరేటర్లతో ఈ మోసాలు నడుపుతున్నారు. అందుకే దర్యాప్తు సంస్థలకు డబ్బు జాడ పట్టడం సవాలుగా మారుతోంది. సైబర్ మోసానికి గురైన వెంటనే అంటే గంటలోపు (గోల్డెన్ అవర్) ఫిర్యాదు చేస్తే డబ్బు నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా ఆపే అవకాశం ఉంటుంది. ఇందుకోసం 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కు వెంటనే కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. ఆలస్యం అయితే డబ్బు తిరిగి రావడం దాదాపు అసాధ్యంగా మారుతోంది.