గత వైసీపీ ప్రభుత్వం అప్పులతోపాటు చెత్తను కూడా వారసత్వంగా ఇచ్చి పోయింది. దానిని సరిచేసేందుకు ప్రభుత్వం నిరం తరాయంగా కృషి చేస్తోంది అని సీఎం చంద్రబాబు తెలిపారు. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆయన ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని తాళ్లాయపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం నిర్వహించిన సభలో సీఎం మాట్లాడుతూ.. 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా వైసీపీ ప్రభుత్వం అప్పుల రూపంలో భారం మోపిందన్నారు. అధిక వడ్డీలకు తీసుకువచ్చి.. ప్రజల నడ్డి విరిచిందన్నారు.
ఇప్పుడు ఆ అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు వడ్డీలను తగ్గించేందుకు రీషెడ్యూల్ చేస్తున్నట్టు చెప్పారు. ఇదేసమయంలో 86 లక్షల టన్నుల చెత్తను కూడా వైసీపీ ప్రభుత్వం వారసత్వంగా ఇచ్చి వెళ్లిందని చంద్రబాబు ఆరోపించారు. ఈ చెత్త నుంచి ఆదాయ మార్గాలను వెతుకుతున్నట్టు చెప్పారు. రీసైక్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. చెత్తను కూడా సంపదగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు చెప్పారు. త్వరలోనే దీనికి పరిష్కారం చూపుతామన్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలుముమ్మరంగా సాగుతున్నాయని వివరించారు.
వచ్చే ఏడాది జూన్‌నాటికి ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. దీనికి అందరూ కలసి రావాలని అన్నారు. ``యూజ్, రికవరీ, రీయూజ్ విధానాన్ని అనుసరిస్తున్న``ట్టు చెప్పారు. ప్రజలందరూ ఈ యజ్ఞంలో భాగస్వాములు కావాలని సీఎం చంద్రబాబు తెలిపారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా రాష్ట్రాన్ని మేలైన స్థాయిలో నిలపాలని సంకల్పించినట్టు తెలిపారు. జన్మభూమి కార్యక్రమం ద్వారా దేశంలోనే తొలిసారి తానే స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం నాటికి రాష్ట్రంలో చెత్తనుఏరేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలిపారు.
ముఖ్యంగా ప్లాస్టిక్ రీయూజ్ ద్వారా సంపద సృష్టించేందుకు కృషి చేస్తున్నట్టు సీఎం చెప్పారు. ప్లాస్టిక్‌వినియోగాన్ని తగ్గించడమే కాకుండా.. తిరిగి ప్లాస్టిక్‌ను విక్రయించడం ద్వారా ప్రజలకు సంపద చేకూర్చేలా వ్యవహరిస్తున్నట్టు తెలిపారు. స్వచ్ఛాంద్ర, స్వర్ణాంధ్ర సంకల్పం నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వైసీపీ హయాంలో పేరుకుపోయిన వారసత్వ చెత్తను తొలగించేందుకు కృషి చేస్తున్నట్టు మరోసారి తెలిపారు. ``చెత్త పాలకులు`` అంటూ వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు.