దేశంలో అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందిస్తున్న భారతీయ రైల్వే.. చార్జీలను పెంచారు. ఈ నెల 26 నుంచే ఈ పెంపు అమలు లోకి రానుంది. కిలో మీటరుకు `పైసా` చొప్పున పెంచుతున్నామని ప్రకటించిన రైల్వే శాఖ.. ఈ పెంపు ద్వారా తమకు 600 కోట్ల రూపాయలకు పైగానే లబ్ధి చేకూరుతుందని అంచనా వేసింది. నిజానికి పండుగల సీజన్ ప్రారంభమైంది. దక్షిణాది, ఉత్తరాదిలలో సంక్రాంతి పండుగను(పేర్లు మారుతాయి) ఘనంగా నిర్వహిస్తారు. దీనికితోడు క్రిస్మస్, న్యూఇయర్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైలు ప్రయాణికులు.. మరింత మంది పెరుగుతారు. ఇప్పటికే వచ్చే మూడు నెలలకురిజర్వేషన్ పూర్తయ్యాయి.
ఈ క్రమంలో తాజాగా ఇండియన్ రైల్వే ధరలు పెంచుతూ.. కీలక నిర్ణయం తీసుకుంది. కిలో మీటరుకు సాధారణ రైళ్లలో పైసా చొప్పున, ఏసీ, సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్‌లకు 2 పైసల చొప్పున పెంచుతున్నట్టు వివరించింది. అయితే.. వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఒకసారి ధరలు పెంచారు. దీనివల్ల సంస్థకు 700 కోట్ల రూపాయలకు పైగానే లబ్ధి చేకూరింది. అయితే.. ఇప్పుడు రైలు చార్జీలు పెంచడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణించే సాధారణ ఎక్స్ ప్రెస్‌లో టికెట్ ధరపై రూ.33 వరకు పెరుగుతుంది.
ఈ రెండు స్టేషన్ల మధ్య దూరం 330 కిలోమీటర్లు(రైలు అంచనా). కిలోమీటరకు పైసా చొప్పున వేసుకున్నా.. 33 రూపాయలు పెరుగుతాయి. ఇక, ఏసీ, స్లీపర్ క్లాసులకు డబుల్ పెరుగుతుంది. దీంతో ప్రయాణికుల నుంచి కూడావ్యతిరేకత వ్యక్తం కానుంది. ఇదిలావుంటే.. పెరుగుతున్న డీజిల్, ఇంథన ఖర్చులు.. వేతనాలు.. వంటివాటిని లెక్కించుకుని ఈ పెంపు చేయాల్సి వచ్చింద ని.. రైల్వే బోర్డు పేర్కొంది. అయితే.. 215 కిలో మీటర్లలోపు సాధారణ రైళ్లలో ఎలాంటి చార్జీలు పెంచడం లేదని తెలిపింది. నాన్ ఏసీ రైళ్లలోనూ అదనంగా 10 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పెంపు ఈ నెల 26 నుంచి అంటే.. 25వ తేదీ అర్థరాత్రి నుంచే అమలులోకి రానుంది.
భద్రత మాటేంటి?
రైలు చార్జీలు పెంచిన బోర్డు.. భద్రత విషయంలో మాత్రం మౌనం వహించడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో సిగ్నలింగ్ వ్యవస్థ లోపాలు.. రైలు నిర్వహణ కారణంగా ప్రమాదాలు పెరుగుతున్నాయి. వందల మంది మృతి చెందుతున్నారు. వారి భద్రత విషయాన్ని ప్రస్తావించని రైల్వే బోర్డు.. ప్రయాణికుల చార్జీలను పెంచడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. మరోవైపు.. రైల్వే ఉద్యోగులు తమ వేతనాలను సవరించాలని కోరడం.. గమనార్హం. చార్జీలు మరింత పెంచాలని భారత రైల్వే కార్మిక సంఘం ఓ ప్రకటనలో డిమాండ్ చేసింది.