అభివృద్ధి యజ్ఞానికి రాక్షసుల్లా అడ్డుపడుతున్నారని.. వైసీపీ నేతలపై సీఎం చంద్రబాబు విరుచుకుపడ్డారు. నానా తిప్పలు పడి పెట్టుబడులు తెస్తుంటే వాటిని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. విశాఖలోని రుషికొండకు గుండు కొట్టి యోగా దినోత్సవంపై విమర్శలు చేస్తున్నారంటూ.. ఇటీవల జగన్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేని వ్యక్తులు పీపీపీ విధానంపై విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్రాభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు.
రుషికొండ ప్యాలెస్ కోసం 500 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసిన వాళ్లు...ప్రజారోగ్యం కోసం యోగా నిర్వహించిన తమపై విష ప్రచారం చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి ప్యాలెస్, రంగు రాళ్లపై బొమ్మల కోసం వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని జగన్‌పై నిప్పులు చెరిగారు. ఒక్క మెడికల్ కాలేజీ అయినా కట్టారా అని ప్రశ్నించారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు కడుతుంటే జైల్లో పెడతామని బెదిరించడం.. వారి రాక్షసత్వానికి నిదర్శనమని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖలో నిర్వహించిన `ప్రజా వేదిక` సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఓవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుంటే కొందరు రాక్షసులు వివిధ రూపాల్లో అభివృద్ధి యజ్ఞాన్ని అడ్డుకుంటున్నారని అన్నారు. ఐటీ కంపెనీలకు భూములు ఇస్తే కోర్టుల్లో కేసులు వేస్తున్నారని దుయ్యబట్టారు. కానిస్టేబుళ్ల నియామకాలపైనా కోర్టులకు పోతున్నారని చెప్పారు. పీపీపీలో మెడికల్ కాలేజీలు కడుతుంటే ప్రైవేటు పరమని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ``యోగా మన భారతీయ సంపద. యోగాకు ప్రధాని మోడీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు. ప్రపంచం గుర్తించేలా, వైజాగ్ పేరు మారుమోగేలా యోగా డే నిర్వహిస్తే దానిపైనా తప్పుడు ఆరోపణలతో విష ప్రచారం చేస్తున్నారు.`` అని వ్యాఖ్యానించారు.
విశాఖను గంజాయి, డ్రగ్స్ కేంద్రంగా మార్చారని.. వైసీపీ పాలనపై సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఇప్పుడు అదే విశాఖను ఏఐ, డేటా సెంటర్, యోగా క్యాపిటల్ గా తయారు చేస్తున్నట్టు చెప్పారు. ``గంజాయి వనాలుగా మార్చిన ప్రాంతాన్ని అరకు వనంగా మార్చాం. కూటమి పాలనలో దందాలు లేవు. గత పాలకులు రుషికొండ ప్యాలెస్ కు గుండు కొట్టించారు. రూ. 500 కోట్ల ప్రజాధనం వృథా చేశారు. సర్వే రాళ్లపై రూ.700 కోట్లు ఖర్చు చేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా లక్ష్య సాధనలో వెనక్కు తగ్గేది లేదు`` అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.