2029 ఎన్నికలలో అఖండ విజయం సాధించడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే 25 పార్లమెంట్ నియోజకవర్గ జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను కూడా లోకేశ్ నియమించారని ప్రచారం జరుగుతోంది. పనితీరును బట్టి వారిని నియమించారట. ఈ క్రమంలోనే తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షురాలిగా పనబాక లక్ష్మిని, ప్రధాన కార్యదర్శిగా డాలర్స్ దివాకర్ రెడ్డిని ప్రకటించారు. యువనేత అయిన డాలర్స్ దివాకర్ రెడ్డికి లోకేశ్ ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని భోగట్టా.
గత ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ గెలుపు కోసం డాలర్స్ దివాకర్ రెడ్డి తీవ్రంగా కష్టపడ్డారు. దానికి గుర్తింపుగానే ఆయనను తుడా చైర్మన్ గా లోకేశ్ నియమించారు. తాజాగా ఆయనను తిరుపతి జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శిగా నియమించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, రాబోయే ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యే టికెట్ ను డాలర్స్ దివాకర్ రెడ్డికి ఇచ్చేందుకు లోకేశ్ సుముఖంగా ఉన్నారని, అందులో భాగంగానే ఇలా కీలక పదవిని ఆయనకు ఇచ్చారని టీడీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.
డాలర్స్ దివాకర్ రెడ్డిపైపు లోకేశ్ మొగ్గు చూపడానికి, రాబోయే ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కవచ్చన్న టాక్ రావడానికి బలమైన కారణం ఉంది. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆయన కుటుంబ సభ్యులపై టీడీపీ అనుకూల పత్రికలో వ్యతిరేక కథనం వచ్చింది. చంద్రగిరిలో టీడీపీపై ప్రస్తుతం కాస్త వ్యతిరేకత ఉందని, రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం అభ్యర్థిని మార్చక తప్పదని టీడీపీ కేడర్ కూడా భావిస్తోందట. ఆ క్రమంలోనే డాలర్స్ దివాకర్ రెడ్డిపై కేడర్ లో కూడా నమ్మకం పెరిగిందట. ఏమైనా సమస్యలుంటే దివాకర్ రెడ్డిని కేడర్ అప్రోచ్ అవుతున్నారట.
చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన డాలర్స్ దివాకర్లో రెడ్డికి లోకేశ్ ప్రాధాన్యత ఇస్తున్నారని, అందుకు తగ్గట్లుగానే సంకేతాలు ఇస్తున్నారని స్థానిక నేతలు అనుకుంటున్నారు. పార్టీని నమ్ముకొని పనిచేస్తూ గత ఎన్నికల్లో గెలుపుకోసం తీవ్రంగా కష్టపడ్డ తనకు చంద్రబాబు, లోకేశ్ న్యాయం చేస్తారని దివాకర్ రెడ్డి కూడా ధీమాగా ఉన్నారట.