వైసీపీ అధినేత జగన్ వైఖరిలో ఏమాత్రం మార్పు కనిపించినట్టుగా లేదు. వచ్చిన సందర్భాన్ని.. అవకాశా న్ని ఎవరైనా సద్వినియోగం చేసుకుంటారు. పరుగుపరుగున అవకాశాన్ని అందుకునే ప్రయత్నం కూడా చేస్తారు. ఈ తరహా పరిస్థితి జగన్‌లో కనిపించడం లేదని వైసీపీ నాయకులుగుసగుసలాడుతున్నారు. తాజాగా జగన్ 53వ పుట్టిన రోజు జరిగింది. ఈ దఫా ఊహించని విధంగా భారీ ఎత్తున జగన్‌కు శభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఎక్కడెక్కడివారో.. కూడాఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇక, ఏపీలో ప్రత్యర్థులుగా ఉన్న చంద్రబాబు, పవన్‌లు కూడా జగన్‌కు శుభాకాంక్షలు చెప్పారు. తాడేపల్లి లోని కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని వైసీపీ కార్యాలయాల్లోనూ కార్యక్రమాలు నిర్వహించారు. మరోవైపు సోషల్ మీడియా సహా.. యూట్యూబ్‌లోనూ అనేక వీడియోలు హల్చల్ చేశాయి. జగన్ పాదయాత్ర నుంచి పాలన వరకు అనేక వందల వీడియోలను యూట్యూబ్‌లో తిరిగి అప్‌లోడ్ చేశారు.
ఈ విషయాలన్నీ వైసీపీ నాయకులు చెప్పలేదు. జగన్‌ను నిరంతరం విమర్శించే కొన్ని మీడియా ఛానెళ్లే చూపించాయి. ఇంత మంచిసమయంలో జగన్.. తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడతారని.. మీడి యా ముందుకు వస్తారని అనుకున్నారు. తద్వారా.. సింపతీని పెంచుకునే ప్రయత్నం అయినా.. చేస్తార ని భావించారు. ఎందుకంటే.. ఇతర సందర్భాల్లో జగన్ మాట్లాడడం వేరు. తన పుట్టిన రోజు నాడు మాట్లాడడం వేరు. ఆయన ఏం చెబుతారా? అని నిజంగానే వేలాది మంది అభిమానులు కూడా ఎదురు చూశారు.
కానీ, చిత్రం ఏంటంటే.. పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్.. సజ్జల రామకృష్ణ ముందుకు వచ్చారు. ఆయనే కేక్ కట్ చేశారు. పార్టీ నాయకులను ఉద్దేశించి ఆయనే మాట్లాడారు. మరి జగన్ ఏంచేసినట్టు అంటే.. చిన్నగా చిరు ట్వీట్ చేసి చేతులు దులుపుకొన్నారు. తన పుట్టిన రోజును పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన వారికి ధన్యవాదాలు అని ముక్తసరి మాటతో సరిపుచ్చారు. ఇది ఆయనకు ఎలాఉన్నా.. అభిమానులను.. ముఖ్యంగా పార్టీ కార్యకర్తలను నిరుత్సాహానికి గురి చేసింది.
ఈ ఏడాది చంద్రబాబు ఏప్రిల్ 20న పుట్టిన రోజు చేసుకున్నారు. కానీ, ఆయన ఇంటికి పరిమితం కాలేదు.. పార్టీ నాయకుల మధ్యకు వచ్చారు. వారిని ఉత్సాహ పరిచారు. ఈ తరహా పరిస్థితి జగన్‌లో కనిపించడం లేదన్న వాదనే ఇప్పుడు ఆసక్తిగా మారింది.