ఏపీలో కూటమి ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న టీడీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు మూడు ఏళ్ల ముందుగా నే పార్లమెంటరీ స్థానాలకు సంబంధించిన నేతలను సమూలంగా మార్చేసింది. యువత, మహిళలు, సీనియర్లకు.. సమపాళ్లలో ప్రాధాన్యం ఇస్తూ.. పార్లమెంటరీ స్థానాల్లో కొత్త సారథులను ప్రకటించింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నవారితోపాటు.. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నవారు.. అదేవిధంగా విధేయులకు వీరతాళ్లు వేసింది. ఈ మేరకు తాజాగా పార్టీ పార్లమెంటరీ స్థానాల కు కొత్త అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులుగా నాయకులకు అవకాశం కల్పించింది.
లక్ష్యం ఇదే..
పార్టీలో కొత్త సారథ్యంపై సీఎం, పార్టీ అధినేత చంద్రబాబు చాలానే ఆశలు పెట్టుకున్నారు. అదేవిధంగా లక్ష్యాన్ని కూడా నిర్దేశించా రు. వచ్చే 15 ఏళ్లపాటు కూటమిని కలివిడిగా ముందుకు తీసుకువెళ్లేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను వీరు పాటించాల్సి ఉంటుంది. అదేవిధంగా క్షేత్రస్థాయిలో పార్టీ కోసం బలంగా పనిచేయాలి. అలానే.. పార్టీ నాయకుల మధ్య విభేదాలు రాకుండా చూడాలి. పార్టీని వచ్చే పంచాయతీ ఎన్నికల్లో పరుగులు పెట్టించి.. మద్దతు దారుల విజయానికి కృషి చేయాలి. దీంతో పాటు 2047 లక్షల్యాలను సాధించేందుకు నాయకులు కృషి చేయాలి.
అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాన్ని ప్రజల మధ్యకు తీసుకువెళ్లడంతోపాటు.. ప్రజల్లో సంతృప్తి స్థాయిని కూడా పెంచాలి. ఇవన్నీ.. పార్టీ అధినేత చంద్రబాబు నిర్దేశిత లక్ష్యాలు. వీటిని దృష్టిలో పెట్టుకునే నాయకులను ఎంపిక చేశారు. ఈ ఎంపికకు కూడా ఈ దఫా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఐవీఆర్ ఎస్ సర్వే నిర్వహించారు. అంతేకాదు.. పార్టీలో నాయకుల కమిటీని ఏర్పాటు చేసి.. నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా జూనియర్లు, యవత, మహిళలకు ప్రాధాన్యం కల్పించాలని భావించినప్పుడు.. వారికి ప్రజల్లో ఉన్న ఆదరణను కూడా కొలమానంగా తీసుకున్నారు.
మొత్తంగా పార్టీకి కొత్తసారథులును ఎంపిక చేశారు. ఇదిలావుంటే.. వైసీపీఅధినేత జగన్ సొంత జిల్లాకడపకు.. ఫైర్ బ్రాండ్ నాయకుడు.. చడిపిరాళ్ల భూపేష్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఆయన గత ఎన్నికల్లో కడప పార్లమెంటు స్థానం నుంచి పోటీ పరాజయం పాలైనా.. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మెజారిటీని భారీగా తగ్గించారు. ఈ కారణంతోనే చంద్రబాబు ఆయనకు కడప పగ్గాలు అప్పగించారు. అదేవిధంగా తిరుపతి పార్లమెంటు స్థానానికి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని నియమించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. ఈమె భర్త, మాజీ అధికారి పనబాక కృష్ణయ్య ప్రస్తుతం కూటమి సర్కారుకు సలహాదారుగా కూడా ఉన్నారు.