ఏపీలో `క్యాలెండర్లు` హల్చల్ చేయనున్నాయి. ఇవేవీ కొత్త సంవత్సరానికి సంబంధించిన యాడ్స్‌కావు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న.. చేయనున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన క్యాలెండర్ ఒకటైతే.. మరొకటి జాబ్ క్యాలెండర్. ఈ రెండు కూడా.. రాష్ట్ర స్థితిగతులను మార్చనున్నాయని.. సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ఇక, తాజాగా మంత్రి నారా లోకేష్ కూడా జనవరి నుంచి జాబ్ క్యాలెండర్ ప్రకటి స్తామన్నారు.
సంక్షేమ క్యాలెండర్..!
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన క్యాలెండర్ ఇది. వచ్చే ఏడాది జనవరిలోనే దీనిని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆ ఏడాదిలో ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన తేదీలు.. ఎంత మంది లబ్ధి దారులు.. ఎంత మొత్తం ఇస్తున్నారు? ఎవరెవరికి మేలు జరుగుతుంది? దీనిలో ఏయే సామాజిక వర్గాలు ఉన్నాయి? ఇలా.. అనేక విషయాలను ప్రస్తావిస్తారు. తద్వారా ప్రజలకు సమగ్రసమాచారం అందించడంతోపాటు.. సమయానికి పథకాలు అందించాలన్న సంకల్పం ఉంది.
జాబ్ క్యాలెండర్..
వచ్చే ఏడాది భర్తీ చేసే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కూడా జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయను న్నారు. సంక్రాంతి తర్వాత.. ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి.. దీనిని విడుదల చేయాలని భావిస్తున్నా రు. తద్వారా ఏయే శాఖల్లో ఎన్నెన్ని ఉద్యోగాలు ఉన్నాయన్న విషయాన్ని ప్రభుత్వం వెల్లడించనుంది. వాటికి ఎప్పుడు ఎలాంటి పరీక్షలు పెడతారు..? కరిక్యులమ్.. ఇలా.. అనేక విషయాలను కూడా పేర్కొంటా రు. తద్వారా నిరుద్యోగులకు మేలు జరగనుంది.
గతంలో కూడా..
గతంలో వైసీపీ కూడా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి క్యాలెండర్ విడుదల చేసింది. అయితే.. సమయానికి నిధులందక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇది ప్రత్యర్థులకు వరంగా మారింది. విమర్శల జోరు పెరిగింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం కూటమి పాలకులపై ఉంది. దీని ప్రకారం.. అమలు చేయాలంటే.. ముందుగానే నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. లేకపోతే.. ప్రకటన చేసి.. సమయానికి ఇవ్వకపోతే.. ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం తప్పదు.