దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా నటుడు శివాజీ చేసిన కామెంట్స్ పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. నటీమణులు కొంచెం డ్రెస్ సెన్స్ పాటించాలని, వారి అందం మొత్తం నిండుగా వేసుకునే దుస్తుల్లోనే ఉంటుందని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే శివాజీ వ్యాఖ్యలపై నందినిరెడ్డి, సుప్రియ యార్లగడ్డ, స్వప్న దత్, లక్ష్మి మంచు, ఝాన్సీలు మా అధ్యక్షుడికి లేఖ రాశారు. తెలంగాణ మహిళా కమిషన్ కూడా శివాజీ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకొని ఆయనకు నోటీసులు పంపింది. ఈ నెల 27న ఉదయం 11 గంటలకు తమ ఎదుట హాజరవ్వాలని మహిళా కమిషన్ ఆదేశించింది.
ఈ క్రమంలోనే తన వ్యాఖ్యలపై శివాజీ క్షమాపణలు చెప్పారు. మంచి చెప్పే క్రమంలో రెండు అసభ్య పదాలు దొర్లాయని, వాటి వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు. ఇటీవల పలువురు హీరోయిన్స్ ఇబ్బంది పడిన సందర్భాన్ని ఉద్దేశిస్తూ మాత్రమే మాట్లాడానని వివరణనిచ్చారు. తాను అమ్మాయిలందరినీ ఉద్దేశించి మాట్లాడలేదని చెప్పారు. మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప ఎవరినీ అవమానపరచాలని, కించపరచాలని తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని అన్నారు.