ఏపీలోని కర్నూలులో ఓ బైకును ఢీకొట్టిన ఘటనలో స్లీపర్ బస్సు దగ్ధమైన ఘటన.. దేశం మొత్తాన్నీ కలచి వేసింది. ఆ ఘటనలో 24 మంది సజీవదహనమయ్యారు. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో గురువారం తెల్లవారు జామున జరిగింది. ప్రైవేటు ట్రావెల్ స్లీపర్ బస్సు దగ్థమైన ఘటనలో ఏకం గా.. 9 మంది సజీవదహనమయ్యారు. వీరిలో బెంగళూరుకు చెందిన ప్రయాణికులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. అదేసమయంలో మరో 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు.
ఏం జరిగింది?
బెంగళూరు నుంచి ప్రఖ్యాత క్షేత్రం గోకర్ణం ప్రాంతానికి వెళ్తున్న బెంగళూరుకు చెందిన ప్రైవేటు ట్రావెల్స్ సంస్థ.. సీబర్డ్‌కు చెందిన ట్రావెల్స్ బస్సు(స్లీపర్) ఘోర ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారిపై అతి వేగంగా వస్తున్న ఓ కంటెయినర్ లారీ.. డివైర్ దాటుకుని.. ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సు కూడా వేగంగానే ఉందని అధికారులు తెలిపారు. దీంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మంటల్లో చిక్కుకుని 9 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. బస్సుతో పాటు కంటెయినర్ లారీకి కూడా మంటలు అంటుకున్నాయి.
డ్రైవర్ సేఫ్
ఈ ప్రమాద ఘటనలో ట్రావెల్స్ బస్సులోని ఇద్దరు డ్రైవర్లు ప్రాణాలతో బయట పడ్డారు. మరికొందరు ప్రయాణికులు అత్యవసర ద్వారాలను పగులగొట్టి.. బయటకు వచ్చాయి. అయితే.. ఈ క్రమంలో వారంతా తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు ట్రావెల్స్ లారీ డ్రైవర్ కూడా ప్రాణాలు దక్కించుకున్నాడు. ఇదిలావుం టే.. మంటలు చెలరేగడానికి డీజిల్ ట్యాంకు పేలిపోవడమేనని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో స్లీపర్ బస్సులో 32 మంది ప్రయాణికులు ఉండగా.. 9 మంది సజీవ దహనం అయ్యారు. 20 మంది గాయపడ్డారు.
తమిళనాడులో కూడా..
తమిళనాడులోనూ గురువారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. మూడు వాహనాలు ఢీ కొన్న ఘటనలో 9 మంది మృతి చెందారు. ఎదురుగా వస్తున్న బస్సును రెండు వాహనాలు ఢీ కొట్టాయి. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. ఏదేమైనా క్రిస్మస్ పర్వదినం రోజు దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటుంటే.. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం విషాదాన్ని నింపింది.