విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషి కొండపై వైసీపీ హయాంలో 7 భవనాలను నిర్మించిన విషయం తెలిసిందే. అయితే.. ఇవన్నీ.. ప్రత్యేక వసతులతో కూడి ఉండడంతో ఇటు వ్యాపారానికి.. అటు ప్రభుత్వం వినియోగించుకునేందుకు కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి. నిజానికి వైసీపీ కనుక మరోసారి అధికారంలోకి వస్తే.. అక్కడి నుంచే పాలన చేపట్టాలని వైసీపీ అదినేత జగన్ భావించినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. కానీ.. గత ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలైంది. ఇక, అప్పటి నుంచి వీటి వినియోగం వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
ఇదిలావుంటే.. రుషికొండపై నిర్మించిన ఏడు భవనాల ను వినియోగంలోకి తీసుకురావడంతోపాటు.. మరి న్ని భవనాలను నిర్మించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రస్తుతం రుషికొండపై ఉన్న ప్యాలెస్ వంటి భవనాలను వినియోగించుకునేందుకు.. వీలుగా పర్యాటక శాఖకు దాదాపు అనుమతులు ఇస్తున్నా రు. తద్వారా.. వాటిని ప్రఖ్యాత హోటల్ సంస్థకు లీజుగా ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో కమిటీ జోరుగా కసరత్తు చేస్తోంది.
టాటా వారి తాజ్, లీలా సహా అంతర్జాతీయ సంస్థలు కూడా.. ముందుకు రావడంతో వారితో మంత్రుల కమిటీ చర్చించింది. ఈ క్రమంలో తమకు ప్రస్తుతం ఉన్న భవనాలు సరిపోవని.. మరిన్ని భవనాలను నిర్మించాలని సదరు సంస్థలు ప్రతిపాదించాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 7 భవనాలకు తోడు మరిన్ని భవనాలను పర్యాటక రంగానికి అనుకూలంగా నిర్మించే దిశగా నిర్ణయం తీసుకోనున్నారు. దీనిపై త్వరలోనేజరగనున్న మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయించి చర్యలు చేపడతారు.
ఏటా 50 కోట్ల ఆదాయం!
రుషికొండ భవనాలను లీజుకు ఇచ్చే ప్రక్రియ విషయంపైనా మంత్రుల కమిటీ అధ్యయనం చేసింది. ఏటా 50 కోట్ల రూపాయలు ఇచ్చేలా.. ప్రతి 3 సంవత్సరాలకు లీజుల రుసుము పెంచేలా నిర్ణయం తీసుకోనున్నారు. తద్వారా ప్రభుత్వానికి ముఖ్యంగా పర్యాటక శాఖకు కూడా ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు.. కొత్తగా నిర్మించే భవనాలను కూడా పర్యాటక లీజుకు ఇవ్వనుంది. ఇక, రుషికొండపై ప్రస్తుతం ఉన్న భవనాల్లో రెండింటిని.. ఎగ్జిబిషన్లుగా నిర్వహించనున్నారు.