ఏపీ మాజీ సీఎం జగన్ బాటలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నడుస్తున్నారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో అసెంబ్లీకి జగన్ డుమ్మా కొట్టగా అదే పంథాలో కేసీఆర్ కూడా కేవలం అటెండెన్స్ కోసమే అసెంబ్లీకి వచ్చి వెళ్లిన వైనంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తన తండ్రి కేసీఆర్ అసెంబ్లీకి గైర్హాజరవుతున్న విషయాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా తప్పుబట్టారు. కేసీఆర్ ఏ తప్పు చేయనప్పుడు సభకు ఎందుకు రావడం లేదని ఆమె ప్రశ్నించారు.
ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి రాకుంటే బీఆర్ఎస్ పార్టీ ఖేల్ ఖతం అని కవిత షాకింగ్ కామెంట్స్ చేశారు. హరీష్ రావుతో పాటు మిగతా బీఆర్ఎస్ నేతలను పిల్లకాకులతో కవిత పోల్చారు కవిత. కమిషన్లు తీసుకోవడం, అమ్మడం తప్ప హరీష్ రావుకి ఏం వచ్చని కవిత నిలదీశారు. తప్పులు చేసిన వారు అసెంబ్లీలో ఏం మాట్లాడతాని ప్రశ్నించారు. ప్యాకేజీలు అమ్ముకున్న ట్రబుల్, బబుల్ షూటర్ ఏం చెబుతారని నిలదీశారు.
మోసం చేసిన వ్యక్తికే బీఆర్ఎస్ డిప్యూటీ లీడర్ పదవి ఇస్తే ఎలా? అని ఆమె ప్రశ్నించారు. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా తెలంగాణ జాగృతి నిలుస్తుందన్నారు. నీళ్ల గురించి కేసీఆర్ కంటే రేవంత్‌కి ఎక్కువ తెలుసా? హరీష్‌కు ఎక్కువ తెలుసా.? అని అన్నారు. అసెంబ్లీలో మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తోందని, అటు సీఎం, ఇటు బబుల్ షూటర్ ఉంటారని, బబుల్ షూటర్ లేకపోతేనే బీఆర్ఎస్ పార్టీ బాగుపడుతుందని హరీష్ రావుపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక, కేసీఆర్ ను ఉరితీయాలని రేవంత్ చేసిన వ్యాఖ్యలను కవిత ఖండించారు. కేసీఆర్ ను ఒకసారి ఉరితీస్తే రేవంత్ రెడ్డిని రెండు సార్లు తీయాలని విమర్శించారు. ఇక, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి తన దగ్గర కొన్ని ఆధారాలున్నాయని, సిట్ అధికారులు పిలిస్తే తాను ఆ ఆధారాలను సమర్పిస్తానని అన్నారు. ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేయగా ఇంకా ఆమోదం పొందాల్సి ఉంది. అయితే రాజీనామా ఇంకా ఆమోదం పొందలేదు కాబట్టి సభలో మాట్లాడే అవకాశం కల్పించాలని శాసనమండలి చైర్మన్ ను కలిసి కవిత కోరినట్లుగా తెలుస్తోంది. లేదంటే తన రాజీనామాను ఆమోదించాలని ఆమె అడిగినట్లుగా తెలుస్తోంది.