తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా మూసీ నది ప్రక్షాళనపై సభాధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆ తర్వాత రేవంత్ వ్యాఖ్యలపై స్పందించేందుకు బీఆర్ఎస్ సభ్యులు ప్రయత్నించగా స్పీకర్ గడ్డం ప్రసాద్ వారికి అవకాశం ఇవ్వలేదు. ముఖ్యమంత్రిని విమర్శిస్తానంటే మైక్ ఇవ్వబోనని, కేవలం సభలో ప్రస్తావనకు వచ్చిన అంశాలపై స్పందిస్తానని స్పందిస్తానంటేనే మైక్ ఇస్తానని స్పీకర్ గడ్డం ప్రసాద్ తేల్చి చెప్పేశారు.
ఈ నేపథ్యంలోనే స్పీకర్ తీరుకు నిరసనగా బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. ఆ తర్వాత అసెంబ్లీ బయట మీడియా సమావేశం ఏర్పాటు చేసి స్పీకర్ తీరుపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ముఖ్యమంత్రిని విమర్శిస్తే మైక్ కట్ చేస్తానని స్పీకర్ చెప్పిన దాఖలాలు దేశ చరిత్రలో లేవని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రిని పొగడాలని, ఇష్టం వచ్చినట్లు నిబంధనలు పెడతామని స్పీకర్ అనడం సరికాదన్నారు. సభలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీకి చెందిన సభ్యుల హక్కులు కాపాడాల్సిన బాధ్యత స్పీకర్ దని, దానిని విస్మరించి నిబంధనలకు విరుద్ధంగా ఆయన రూలింగ్ పాస్ చేయడం ఏమిటని జగదీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే స్పీకర్ గడ్డం ప్రసాద్ పై సోషల్ మీడియాలోనూ విమర్శలు వస్తున్నాయి. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ లను రేవంత్ విమర్శిస్తున్నప్పుడు కూడా ఈ విధంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ నియంత్రిచాలి కదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. స్పీకర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. సీఎంను విమర్శిస్తే మైక్ కట్ అంటూ నిబంధనలు విధించడం ఏంటని దుయ్యబడుతున్నారు.