రాష్ట్రంలో కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవి.. బుధవారం(డిసెంబరు 31) నుంచే అమల్లోకి రానున్నాయి. అదేవిధంగా ఐదు మండలాలను కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మార్కాపురం, పోలవరం 2 కొత్త జిల్లాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఐదు రెవెన్యూ డివిజన్లను కూడా ఏర్పాటు చేసింది. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, ఎస్పీలు, అదనపు ఎస్పీలు, ఆర్డీవోలు, సిబ్బంది నియామకాలను కూడా ప్రభుత్వం పూర్తి చేసింది.
బుధవారం నుంచే జిల్లా కేంద్రాల నుంచి పాలన మొదలవుతుందని ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది. రెండు కొత్త జిల్లాలు, ఐదు రెవెన్యూ డివిజన్లతోపాటు వివిధ ప్రాంతాల్లో మార్పుచేర్పులపై రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక, అనకాపల్లి జిల్లాలోని అడ్డరోడ్డు జంక్షన్, ప్రకాశం జిల్లాలోని అద్దంకి, అన్నమయ్య జిల్లాలోని పీలేరు, శ్రీసత్యసాయి జిల్లాలోని మడకశిర,నంద్యాల జిల్లాలోని బనగానపల్లిలను నూతన రెవెన్యూ డివిజన్లుగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటిలో కూడా బుధవారం నుంచే పాలన ప్రారంభం కానుంది.
కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో మార్కాపురం అనేది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. ఇప్పుడు దానిని సాకారం చేయడం ద్వారా.. ప్రజల అభిప్రాయానికి ప్రభుత్వం పెద్దపీట వేసినట్టు అయింది. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మార్కాపురం వాసులకు మెరుగైన పాలన చేరువ కానుంది. వాస్తవానికి ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంత వాసుల కల సాకారమైందనే చెప్పాలి. పశ్చిమ ప్రాంతంలోని మార్కాపురం, గిద్దలూరు,యర్రగొండపాలెం,కనిగిరి నియోజకవర్గాలతో మార్కాపురం జిల్లా ఏర్పాటు చేశారు.
మార్కాపురం,కనిగిరి రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 21 మండలాలతో మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేశారు. ఇక, కొత్తగా ఏర్పాటు చేసిన అద్దంకి రెవెన్యూ డివిజన్ ను, గతంలో నెల్లూరు జిల్లాలో కలిపిన కందుకూరు రెవెన్యూ డివిజన్ ను తిరిగి ప్రకాశం జిల్లాలో విలీనం చేశారు. దీంతో ప్రకాశం జిల్లాను 28 మండలాలతో పునర్వ్యవస్థీకరించారు. తద్వారా ప్రజలకు మరింతగా పాలన, అభివృద్ధి సాకారం కానున్నాయి. ఇక, పోలవరం జిల్లాలోనూ.. రంపచోడవరాన్ని చేర్చి మొత్తం 13 మండలాలతో ఈ జిల్లాను ఏర్పాటు చేశారు.
పోలవరం జిల్లాకు జిల్లా కేంద్రంగా రంపచోడవరం ఉండనుంది. ఇక, ఈ జిల్లాలో రెవెన్యూ డివిజన్లుగా రంపచోడవరం, చింతూరు ఉంటాయి. అదేసమయంలో 13 మండలాలు ఉండనున్నాయి. అయితే.. అసెంబ్లీ సెగ్మెంట్‌గా రంపచోడవరమే ఉండనుంది. ఇక, కొత్త జిల్లాపరిధిలో 186 పంచాయతీలు ఉండనున్నాయి. 827 గ్రామాలు ఉంటాయి. తద్వారా.. గిరిజనులు ఎప్పటి నుంచో కోరుతున్న పోలవరం సాకారమైంది. దీనిని గుర్తించడం ద్వారా జిల్లాకు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే అవకాశం కూడా ఏర్పడింది.