రియల్ ఎస్టేట్ బాగోలేదంటూ తెలంగాణ అధికారపక్షంపై విపక్షం తరచూ చేసే ఆరోపణల్లో నిజం లేదన్న విషయాన్ని తాజా రిపోర్టు స్పష్టం చేస్తోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నిర్వహించిన అధ్యయన వివరాలు ఆసక్తికరంగానే కాదు.. రియల్ రంగం హైదరాబాద్ లో దేశంలోనే మెరుగైన స్థానంలో ఉందన్న విషయాన్ని స్పష్టం చేస్తుందని చెప్పాలి.
2025 ముగిసే నాటికి దేశంలోని ఆరు మహానగరాల్లోని పరిస్థితులపై రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ తాజాగా ఒక అధ్యయనాన్ని చేపట్టింది. ఈ సంస్థ సిద్ధం చేసిన రిపోర్టు ప్రకారం చూస్తే.. అమ్ముడుకాని ఇళ్ల విషయానికి వస్తే.. హైదరాబాద్ మెరుగైన స్థానంలో ఉన్నట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో అమ్ముడు కాని ఇళ్ల జాబితాలో అత్యంత మెరుగైన స్థానంలో ముంబయి (ఎంఎంఆర్) నిలిస్తే.. తర్వాతి స్థానంలో హైదరాబాద్ నిలిచింది. అత్యంత దారుణ పరిస్థితిని బెంగళూరు నిలవటం గమనార్హం. చెన్నై సైతం బెంగళూరు కంటే మెరుగైన స్థానంలో నిలవటం విశేషం. 2024 ముగిసే నాటికి హైదరాబాద్ లో అమ్ముడుకాని ఇళ్లు/ఫ్లాట్ సంఖ్య 97,765 ఉంటే.. 2025 ముగిసే నాటికి ఈ సంఖ్య ఒక శాతం తగ్గి 96,140గా ఉంది.
అదే సమయంలో దేశ ఆర్థిక రాజధానిగా పేర్కొనే ముంబయి విషయానికి వస్తే 2024 ముగిసే నాటికి 1,80,964 ఉంటే.. 2025 ముగిసే నాటికి 1,79,228కు తగ్గినట్లుగా రిపోర్టు వెల్లడించింది. ఇందుకు విరుద్ధంగా బెంగళూరు.. చెన్నై మహానగరాల్లో అమ్ముడుకాని ఇళ్ల సంఖ్య భారీగా ఉండటం గమనార్హం. 2024 ముగిసే నాటికి బెంగళూరులో అమ్ముడుకాని ఇళ్లు/ఫ్లాట్ల సంఖ్య 52,807గా ఉంటే 2025 ముగిసేనాటికి ఈ సంఖ్య 64,863కు పెరిగినట్లుగా పేర్కొన్నారు.
అదే సమయంలో చెన్నై విషయానికి వస్తే.. 2024 ముగిసే నాటికి 28,423గా ఉన్న ఇళ్లు/ఫ్లాట్ల సంఖ్య 2025 ముగిసే నాటికి33,434కు పెరిగాయి. ఇక.. అమ్ముడుకాని ఇళ్లలో బెంగళూరు.. చెన్నై తర్వాత కోల్ కతా నగరం నిలిచింది.వీటి కంటే మెరుగ్గా ఫుణె ఉండటం విశేషం. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో అమ్ముడవ్వాల్సిన ఇళ్లు/ఫ్లాట్లు 2024 ముగిసే నాటికి 5,53,073గా ఉంటే 2025 ముగిసేనాటికి 5,76,617గా ఉన్నాయి.
అంటే. 2024తో పోలిస్తే 2025లో నాలుగు శాతం ఎక్కువగా ఉన్నట్లుగా తేలింది. దీనికి భిన్నంగా ముంబయి, హైదరాబాద్ మహానగరాలు ఉండటం ఇక్కడ రియల్ ఎస్టేట్ మెరుగ్గా ఉందన్న విషయాన్ని తాజా రిపోర్టు స్పష్టం చేస్తుందని చెప్పాలి.