అగ్రరాజ్యం అమెరికాలో ఎన్ఆర్ఐ యువతి దారుణంగా హత్యకు గురైంది. షాకింగ్ అంశం ఏమంటే.. ఆమె కనిపించటం లేదని ఆమె మిత్రుడు అమెరికా పోలీసులకు ఫిర్యాదు ఇవ్వటం.. చివరకు అతడి ఇంట్లోనే ఆమె హత్యకు గురైన విషయాన్ని గుర్తించారు. అదే సమయంలో కంప్లైంట్ ఇచ్చినోడు అమెరికాను విడిచి పారిపోయిన వైనాన్ని గుర్తించారు.
హత్యకు గురైన యువతి సికింద్రాబాద్ కు చెందినట్లుగా చెబుతున్నా.. ఆమెకు సంబంధించిన భారత మూలాలు మాత్రం బయటకు రాలేదు. ఎన్ఆర్ఐ వర్గాల్లో సంచలనంగా మారిన ఈ దారుణ ఉదంతంలోకి వెళితే.. అగ్రరాజ్యం మేరీలాండ్ లో ఉన్న కొలంబియాలో నికిత గొడిశాల అనే 27 ఏళ్ల యువతి దారుణ హత్యకు గురైంది. ఆమె డెడ్ బాడీని ఒకప్పటి ఆమె మిత్రుడి నివాసంలోనే పోలీసులు గుర్తించారు. అయితే.. అతడి ఆచూకీ మాత్రం లభించలేదు.
అతడి కోసం పోలీసులు ఇప్పుడు గాలిస్తున్నారు. తన స్నేహితురాలు కనిపించటం లేదని పోలీసులకు సమాచారం ఇచ్చిన అతను.. ఆ తర్వాత అమెరికాను విడిచి పారిపోయినట్లుగా గుర్తించారు. దీంతో అర్జున్ శర్మ అనే 26 ఏళ్ల యువకుడి కోసం పోలీసులు సెర్చ్ వారెంట్ జారీ చేసి వెతుకుతున్నారు.
జనవరి 2న మేరీలాండ్ పోలీసులకు అర్జున్ రెడ్డి తన స్నేహితురాలు నికిత కనిపించకుండా పోయిందని పేర్కొన్నారు. ఆమెను చివరిసారిగా తాను ఎల్లికాట్ సిటీలో డిసెంబరు 31న చూసినట్లు చెప్పారు. అదే సమయంలో నికిత ఆచూకీ కోసం ఆమె స్నేహితులు తీవ్రంగా ప్రయత్నించారు. ఆమె ఫోటోను సోషల్ మీడియాలో ఉంచారు. ఇదిలా ఉండగా.. పోలీసులను సంప్రదించిన అర్జున్ శర్మ తాను నికితను డిసెంబరు 31న చూసినట్లు చెప్పటం.. అనంతరం అతడి ఆచూకీ లేకపోవటంతో అనుమానంతో అతడి నివాసాన్ని పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
అతను ఉంటున్న అపార్ట్ మెంట్ లో నికిత డెడ్ బాడీని గుర్తించారు. ఆమె ఒంటిపై పలు గాయాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అదే సమయంలో అర్జున్.. భారత్ కు పారిపోయిన విషయాన్ని గుర్తించి.. అతడి ఆచూకీ కోసం ఫెడరల్ అధికారుల సాయాన్ని కోరారు. నికిత హత్య గురించి తెలిసిన ఆమె స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం ఆమె డిసెంబరు 31 రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో మరణించినట్లుగా తేల్చారు.
ఆమె సోషల్ మీడియా ఖాతాల ప్రకారం చూస్తే.. ఆమెది సికింద్రాబాద్ అని భావిస్తున్నా.. ఆమె భారత్ లోని ఏ ప్రాంతానికి చెందినదన్న విషయాన్ని పోలీసులు అధికారికంగా ప్రకటించలేదు. ఏమైనా.. తన ఫ్రెండ్ కనిపించటం లేదని పోలీసులకు చెప్పిన మిత్రుడు అర్జున్ శర్మ పారిపోవటంతో ఈ ఉదంతంలో అతడి పాత్రపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడ్ని విచారిస్తే అసలు విషయం బయటకు వస్తుందని భావిస్తున్నారు.