ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలో తాజాగా నిర్మాణంలో ఉన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్ర యంలో ఆదివారం... తొలి విమానం ల్యాండ్ అయింది. అయితే... నిర్మాణ పనులు ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి కానున్నాయి. అనంతరం.. ఇది పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇది దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయం కానుంది. అయితే.. ఇప్పుడు ఈ నిర్మాణంపై ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది. దీనిని తామే నిర్మించామని వైసీపీ, కాదు.. మేమే నిర్మాణం చేస్తున్నామని అధికార టీడీపీ మధ్య పొలిటికల్ సెగ రాజుకుంది.
ఈ క్రమంలో క్రెడిట్ తమకంటే తమకే దక్కుతుందంటూ.. వైసీపీ, టీడీపీ నాయకులు రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు. వాస్తవానికి 2014-2018 మధ్య కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న టీడీపీ నేత, ప్రస్తుత గోవా గవర్నర్ పూసపాటి అశోక్‌గజపతి రాజు.. అప్పటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు.. పలు రాష్ట్రాలకు విమానాశ్రయాలను కేటాయించారు. దీనిలో భాగంగానే.. భోగాపురం విమానాశ్రయం ఏపీకి వచ్చింది. ఈ సమయంలో అటు ఒడిశా, ఇటు ఏపీలకు మధ్యలో ఇది ఉండాలని నిర్ణయించారు.
అయితే.. అప్పట్లో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న నేపథ్యంలో రైతుల నుంచి భారీ ఎత్తున భూములు సేకరించ డాన్ని తప్పుబట్టింది. భోగాపురం విమానాశ్రయానికి 1500 ఎకరాలు కేటాయించడాన్ని కూడా ప్రశ్నించింది. రైతులతో కలిసి ఉద్యమించిన.. జగన్.. భోగాపురం విమానాశ్రయంతో ఒరిగేది కూడా ఉండదన్నారు. దీంతో అప్పట్లో రైతుల నిరసనలు, కేసుల కారణంగా.. భూ సేకరణ నిలిచిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. అదే భోగాపురం విమానాశ్రయాన్ని కొనసాగిస్తూ.. కేంద్రానికి లేఖ రాశారు.
అప్పట్లో పేర్కొన్న 1500 ఎకరాల్లో 200లకు కోతపెట్టి .. 1300 ఎకరాలకు స్థిరీకరించారు. ఈ క్రమంలోనే భూ సేకరణ, భూమి పూజ కూడా జగన్ హయాంలో జరిగాయి. దీనిని జీఎంఆర్ సంస్థ నిర్మిస్తోంది. ఇదిలావుం టే.. గత ఏడాది కాలంలో పనులు వడివడిగా సాగాయి. ఫలితంగా తొలి ఫ్లైట్.. ఆదివారం ల్యాండ్ అయిం ది. సో.. మొత్తంగా.. అటు టీడీపీ, ఇటు వైసీపీ రెండు ప్రభుత్వాలు కూడా ఈ విమానాశ్రయ అభివృద్ధికి కృషి చేసిన మాట వాస్తవం. ఇక రాజకీయాలనేవి.. సహజమే కాబట్టి.. ఈ విషయాన్ని ఆయా పార్టీలే తేల్చుకుంటాయి. ఈ క్రమంలోనే జగన్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. బుద్ధున్నోడు భోగాపురం విమానాశ్రయం కడతాడా అంటూ జగన్ అప్పట్లో చేసిన వ్యాఖ్యలు మరిచిపోయారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.