నేను తెలుగు వాణ్ని.. నాది `తెలుగు దేశం`-అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ నినాదం.. ఇప్పటిది కాదని.. గతంలో పార్టీ పెట్టినప్పుడే.. దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ చేసిన నినాదమని పేర్కొన్నారు. దీనిని కాపాడుకుంటూ వస్తున్నట్టు తెలిపారు. తాజాగా సోమవారం ఆయన.. గుంటూరు నిర్వహిస్తున్న తెలుగు ప్రపంచ మహాసభలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం.. సభలో మాట్లాడారు.
తెలుగు వారు ఎక్కడ ఉన్నా.. గౌరవంగా తలెత్తుకుని జీవించాలన్నదే ఎన్టీఆర్ ఆశయమని చంద్రబాబు తెలిపారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీని ఆయన స్థాపించినట్టు పేర్కొన్నారు. తెలుగు నేలపై పుట్టి.. తెలుగు వారి రుణం తీర్చుకునేందుకు ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారని తెలిపారు. తెలుగు వాడు ప్రధాని అవుతుంటే(పీవీ నరసింహారావు) పోటీకి కూడా ఎవరినీ పెట్టేలేదని గుర్తు చేశారు. దేశంలో ఆరు భాషలకు మాత్రమే ప్రాచీన హోదా దక్కిందన్న ముఖ్యమంత్రి దానిలో తెలుగు కూడా ఉండడం అందరికీ గర్వకారణమని పేర్కొన్నారు.
నేడు ప్రపంచ వ్యాప్తంగాతెలుగు వారు అనేక కీలక స్థానాల్లో ఉన్నట్టు చంద్రబాబు తెలిపారు. అనేక ప్రతిష్టా త్మక సంస్థలను తెలుగు వారు నడిపిస్తున్నారని పేర్కొన్నారు. తెలుగు భాష అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని తెలిపారు. త్వరలోనే ప్రభుత్వ పాలన అంతా తెలుగులోనే జరిగేలా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా సాంకేతికతను వినియోగించుకుని తెలుగును ప్రతి ఒక్కరికీ చేరువ చేయనున్నట్టు వివరించారు. ఇప్పటికే ఈ దిశగా అడుగులు వేశామని తెలిపారు.
తెలుగు మహాసభలు.. తెలుగు వారి కీర్తిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నా రు. దాదాపు 40 వేల మంది ప్రతినిధులు హాజరు కావడం చాలా గొప్పవిషయమన్న ఆయన.. దేశంలో తెలుగు మాట్లాడే వారు మూడోస్థానంలో ఉన్నారని తెలిపారు. తెలుగును పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా చంద్రబాబు తెలిపారు. కాగా.. విదేశీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు ఆదివారం తిరిగి వచ్చిన విషయం తెలిసిందే.