ఉత్తరప్రదేశ్‌లోని రామజన్మభూమి.. అయోధ్యలో రెండేళ్ల కిందట ప్రాణం పోసుకున్న ప్రతిష్టాత్మక బాలరామయ్య ఆలయంలో తీవ్ర కలకలం రేగింది. ఓ మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.. నేరుగా ఆలయంలోకి ప్రవేశించి.. సీతమ్మ వారి ప్రత్యేక మందిరం ముందు పట్టా పరుచుకుని నమాజ్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన తీవ్రస్థాయిలో రాష్ట్రాన్ని.. దేశాన్ని కూడా కుదిపేసింది. హుటాహుటిన స్పందించిన కేంద్ర ప్రభుత్వం అసలు అయోధ్యలో ఏం జరిగిందో తమకు నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు.. ఇప్పటి వరకు లేని విధంగా అయోధ్యకు 15 కిలో మీటర్ల పరిధిలో నాన్ వెజ్ సహా కోడిగుడ్ల వినియోగం, విక్రయాలను నిషేధించారు.
ఏం జరిగింది?
శనివారం మధ్యాహ్నం.. వేళ ఆలయంలో భక్తుల సందడి కొనసాగుతోంది. వరుస సెలవుల కారణంగా.. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు. మరోవైపు.. ఎప్పుడూ ఉండే భక్తులే కదా.. అని భద్రతా సిబ్బంది కూడా సాధరణ నిఘానే కొనసాగించా యి. ఇంతలో మైనారిటీ ముస్లిం వర్గానికి చెందిన అబూ అహ్మద్ షేక్.. ఆలయంలోకి ప్రవేశించారు. వాస్తవానికి హిందువు అయితే.. అయోధ్యలోకి ప్రవేశం ఉంటుంది. దీనికి సంబంధించి ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కానీ.. ఎక్కడ తేడా కొట్టిందో తెలియదు కానీ.. అబూ ఆలయంలోకి వచ్చారు.
అంతేకాదు.. అయోధ్య ప్రాంగణంలోనే.. మందిరం దక్షిణ భాగంలో ఉన్న సీతా రసోయి(సీతమ్మ) ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడే కింద ఓ క్లాత్‌పరుచుకుని నమాజ్ చేసేందుకు ఉద్యుక్తుడయ్యారు. అయితే.. అప్పటి వరకు నిద్రాణంగా ఉన్న భద్రతా సిబ్బంది.. ఈ విషయాన్ని గ్రహించి.. ఉలిక్కి పడింది. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అబూ.. మైనారి టీ వర్గానికి అన్యాయం జరుగుతోందని.. ఇది ముస్లింల పవిత్ర ప్రాంతమని నినాదాలు చేయడం గమనార్హం. ఒకప్పుడు ఇక్కడ బాబ్రీమసీదు ఉండేదని.. ఇక్కడ తనకు నమాజ్ చేసుకునే హక్కు ఉందని వ్యాఖ్యానించడంతో పోలీసులు హుటాహుటిన ఆయనను తరలించారు.
మరోవైపు.. ఈ ఘటనతో అయోధ్యలో ఆంక్షలను మరింత కట్టుదిట్టం చేశారు. నిజానికి భారీ ఎత్తున సీసీ కెమెరాలు.. వందలాది మంది సైన్యం పహారాలో ఉండే అయోధ్యలో ఇలా జరగడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమైంది. ఈ వార్త తెలియగానే కేంద్రం వెంటనే స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది. పైగా.. రాముడికి ఇష్టమైన శనివారం నాడే ఇది జరగడంతో మరింత ఆందోళన వ్యక్తం కావడం గమనార్హం. కాగా.. అబూను.. కశ్మీరష్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఇతని వెనుక ఎవరైనా ఉన్నారా? ఏదైనా పక్కా ప్రణాళికతోనే అయోధ్యకు వచ్చారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అన్ని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. మరోవైపు భద్రతను కట్టుదిట్టం చేశారు.