జగన్ పాలనలో ఏపీలో లా అండ్ ఆర్డర్ ఎంతగా దిగజారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. డాక్టర్ సుధాకర్ వంటి వారిని నడి రోడ్డుపై మోకాళ్ల మీద కూర్చోబెట్టడం మొదలు టీడీపీ యువనేత లోకేష్ యువగళం పాదయాత్రను అడ్డుకునేందుకు పలు ఆంక్షలు విధించడం వరకు పోలీసులను జగన్ ముప్పుతిప్పలు పెట్టారు. అయితే, ముఖ్యమంత్రి సమర్థుడైతే పోలీసులు ఏ విధంగా పనిచేస్తారో చెప్పేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలు. సీఎం చంద్రబాబు పాలనలో శాంతి భద్రతలు ఎంత భద్రంగా ఉన్నాయో చెప్పే ఘటన ఇది.
విశాఖపట్నంలో ఓ మహిళపై దాడి జరిగన కేసును గంటల వ్యవధిలోనే ఛేదించి నిందితుడిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్న వైనం హాట్ టాపిక్ గా మారింది. పోలీసుల పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. స్పష్టమైన ఆధారాలు లేకున్నా ఆ కేసును ఛేదించడంలో పోలీసుల చొరవ, వృత్తి నైపుణ్యాన్ని ప్రశంసించారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్‌కు భంగం కలిగించేలా వ్యవహరించే వారిని ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
విశాఖలో శాంతిభద్రతలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమని చంద్రబాబు అన్నారు. మహిళల భద్రత విషయంలో విశాఖ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. ప్రజల భద్రతకు ఏపీ పోలీసులు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారని చెప్పారు. చిన్న చిన్న ఘటనలను అడ్డం పెట్టుకుని ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తూ, విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీయాలని ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు.
అసలేం జరిగిందంటే...విశాఖలో విజయదుర్గ అనే మహిళపై ఓ వ్యక్తి దాడి చేసి, అసభ్య పదజాలంతో దూషించాడు. ఆమె ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. బలమైన ఆధారాలు లేకున్నా తమ నైపుణ్యంతో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు.
ఈ ఘటనపై పోలీసులు స్పందించిన తీరు అద్భుతమని ఫిర్యాదు ఇచ్చిన విజయ దుర్గ అన్నారు. నిందితుడు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఆమె స్టేషన్ కు వెళ్లి నిర్ధారించుకున్నారు. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవద్దని, మానసిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించాలని పోలీసులకు ఆమె విజ్ఞప్తి చేశారు.