మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ రోజు స్పెషల్ ప్రీమియర్ల సందడి ఆల్రెడీ మొదలైంది. మెగా ఫ్యాన్స్ కు రెండ్రోజుల ముందుగానే పండగ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ సినిమా సక్సెస్ కావాలని ఓ మెగా అభిమాని చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఈ సినిమా విజయం సాధించాలని వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కోరిన వైనం హాట్ టాపిక్ గా మారింది.
"నా అభిమాన నటుడు చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సూపర్ డూపర్ హిట్ అవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను" అంటూ చిరంజీవితో గతంలో దిగిన ఒక ఫొటోను కూడా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు అంబటి. అయితే, పవన్ ను నిత్యం విమర్శించే అంబటి...చిరును కాకా పడుతున్న వైనం చర్చనీయాంశమైంది. మరి, అంబటి ట్వీట్ కు చిరు రిప్లై ఇస్తారా లేదా అన్నది వేచి చూడాలి.
మన శంకర వర ప్రసాద్ గారు సినిమాపై నెగెటివ్ ప్రచారాన్ని అడ్డుకునేలా కోర్టు ఇచ్చిన తీర్పుపై హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. టికెటింగ్ ప్లాట్‌ఫామ్‌లలో సినిమాపై దురుద్దేశపూర్వక రేటింగ్‌లు, రివ్యూలను నిరోధించేలా కోర్టు ఆదేశాలు జారీ చేయడం సంతోషకరమన్నారు. తన చిత్రం డియర్ కామ్రేడ్ నుంచే ఈ ట్రెండ్ మొదలైందని గుర్తు చేసుకున్నారు.