రాష్ట్ర ప్రజల ఆస్తులు హారతి కర్పూరంలా కరిగిపోవడానికి రేవంత్ సర్కారే కారణమి కేటీఆర్ మండిపడ్డారు. 6 గ్యారంటీలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి నవ్వేవారని గుర్తు చేశారు. ఇక్కడ లంకెబిందెలు ఉంటాయని తాను వచ్చానని, అవి ఇక్కడ లేవని రేవంత్ చెప్పారని మండిపడ్డారు. కేసీఆర్ చేసిన అప్పు రూ.2.80లక్షల కోట్లని, ప్రజా సంక్షేమం కోసమే అది చేశారని కేటీఆర్ స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఏం చేశారని కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్ పరిధిలో ఒక్క ఇందిరమ్మ ఇల్లూ ఆయన కట్టలేదన్నారు. రేవంత్‌రెడ్డి ఇల్లు కట్టే వ్యక్తి కాదని కూలగొట్టే వ్యక్తి అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. పందిలాగా వందేళ్లు బతకొద్దు.. నంది లెక్క నాలుగేళ్లు బతికినా చాలని పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండేళ్లలో రేవంత్ చేసిన మోసం చాలని.. పాలనపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.