అమరావతి రాజధానిపై ఏపీ మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే, ఆ వెంటనే సజ్జల వచ్చి జగన్ కామెంట్లకు పూర్తి భిన్నంగా అమరావతి గురించి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే జగన్ కు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. అమరావతిపై కొందరు అనవసరంగా వివాదాలు సృష్టిస్తున్నారని, అది తగదని ఆయన హితవు పలికారు. అమరావతిపై అనవసర రాద్ధాంతాలు వద్దని అన్నారు.
అమరావతి రాష్ట్రంలో మధ్యలో ఉందని, రాష్ట్రానికి గుండెలా పనిచేస్తుందని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేకుండా పోయిందని, అమరావతి అభివృద్ధి పనులను కేంద్రం, రాష్ట్రం సంయుక్తంగా కొనసాగిస్తున్నాయని చెప్పారు. అమరావతి చిన్న గ్రామం కాదని... విజయవాడ, గుంటూరు, గన్నవరం, మంగళగిరి ప్రాంతాలను కలిపే మహా నగరమని చెప్పారు.
స్వర్ణ భారత్ ట్రస్టులో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హాస్య నటుడు బ్రహ్మానందం, ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.