వైసీపీ అధినేత జగన్ సొంత బాబాయి వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసు కుంది. ఈ కేసులో తాము అనుమానం వ్యక్తం చేస్తున్న వారిని విచారించేందుకు అనుమతించాలని కోరుతూ.. ఆమె మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారిస్తున్న హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. తాము వేసిన పిటిషన్ ను పూర్తిగా పరిశీలించకుండానే గతంలో ఆదేశాలు ఇచ్చిందని పేర్కొన్నారు. కేవలం పాక్షిక దర్యాప్తునకే అనుమతి ఇవ్వడాన్ని సునీత తాజాగా దాఖలు చేసిన అప్లికేషన్‌లో ప్రశ్నించారు.
అంతేకాదు.. తాము సీబీఐ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పలువురిపై అభ్యంతరం వ్యక్తం చేశామని.. కానీ, ఇద్దరిపై మాత్రమే పాక్షిక విచారణకు కోర్టు అనుమతించిందని వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. తాము పలువురిపై సందేహాలు వ్యక్తం చేశామని.. హత్యలో వారి పాత్రకు సంబంధించిన కీలక అంశాలపై ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించామని.. అయినప్పటికీ.. వారిని విచారణ నుంచి తొలగించారని సునీత పేర్కొన్నారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పట్టించుకోలేదన్నారు.
ఈ నేపథ్యంలో తాము లేవనెత్తిన అంశాలపై విచారణకు ఆదేశించాలని ఆమె అభ్యర్థించారు. ఈ అప్లికేషన్‌ను విచారణకు స్వీకరిం చిన సుప్రీంకోర్టు గతంలో దాఖలైన పలు పిటిషన్లతో జత చేసింది. వచ్చే మంగళవారం ఆయా పిటిషన్లపై విచారణ జరపనుంది. కాగా.. గత పిటిషన్లలో జగన్, ఆయన సతీమణికి వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు తెల్లవారు జామునే ఫోన్లు రావడంపై విచారణ జరపాలని.. సునీత కోరారు. వారికి ముందస్తుగా ఎలా సమాచారం అందిందని ప్రశ్నించారు.
ఈ కోణంలోనే విచారణ చేపట్టాలని అభ్యర్థించారు. అయితే.. ఈ వాదనను గతంలో హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు తోసిపుచ్చింది. దగ్గర బంధువులకు ఫోన్లు రాకపోతే.. దారిన పోయే వారికి వస్తాయా? అని అప్పట్లో కోర్టు వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే తాజాగా సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.