ఏ పార్టీకైనా వాయిస్ ముఖ్యం. ఏ కార్యక్రమం చేసినా.. మాట్లాడేందుకు.. నాయకులు ఉండాలి. ముందుకు రావాలి. తమ పార్టీ తరఫున బలమైన వాయిస్ వినిపించాలి. ఈ విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా.. పార్టీ గ్రాఫ్ పుంజుకోవడం అటుంచితే.. మరింత చిక్కుల్లో పడుతుంది. ఈ విషయంలో వైసీపీ చాలా విషయాలు గుర్తెరగాల్సి ఉంది. లేకపోతే.. ఇబ్బందులు తప్పవు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు ముగిసి.. దాదాపు 20 మాసాలు గడిచిపోయాయి.
ఇప్పటి వరకు బలమైన వాయిస్ వినిపించారా? అంటే.. లేదు. ప్రజాస్వామ్య యుతంగా ప్రజలను తమ వైపు తిప్పుకొన్నారా? అంటే.. అది కూడా లేదు. ఏ కార్యక్రమం చేపట్టినా.. వివాదాలు.. విమర్శలు.. హెచ్చ రికలు!. ఇదీ.. ఈ 20 మాసాల కాలంలో వైసీపీ నాయకులు ముఖ్యంగా పార్టీ అధినేత, మాజీసీఎం జగన్ అనుసరించిన తీరు. ఆది నుంచి గమనిస్తే.. ఆయన తీరులో ఎక్కడా మార్పు రాలేదు. మిర్చి రైతులను పరామర్శించేందుకు వెళ్లినప్పుడు.. ఈ కూటమి ప్రభుత్వం కూలిపోతుందన్నారు.
ఆ తర్వాత.. పత్తిరైతులను పరామర్శించేందుకు వెళ్లినప్పుడు..సీఎం చంద్రబాబు పై తీవ్ర విమర్శలు గుప్పించారు. వ్యక్తిగతంగా మరోసారి ఆయనను టార్గెట్ చేసుకున్నారు. ఇక, తెనాలిలో ఎస్సీ యువతపై పోలీసులు లాఠీచార్జి చేసినప్పుడు వారిని పరామర్శించేందుకు వెళ్లి.. గంజాయి బ్యాచ్‌కు మద్దతు తెలిపారు. ఇది తీవ్రంగా పార్టీకి వాయిస్ లేకుండా చేసింది. జగన్ వైఖరిని ఎలా సమర్థించుకోవాలో తెలియలేదు. ఇక, పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను వ్యతిరేకిస్తామనిచెప్పారు.
ప్రజాస్వామ్యంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ఎవరూ తప్పుబట్టరు. కానీ, ఈ క్రమంలో కాంట్రాక్టు సంస్థ లను జైలుకు పంపిస్తామని చేసిన జగన్ వ్యాఖ్యలు.. పార్టీకి మైనస్ అయ్యాయి. దీంతో నాయకులు కూడా.. అప్పటి చేసిన కృషి, నిరసనలు.. అన్నీ బూడిదలో పోసినట్టు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తాజాగా రాజధాని విషయంలోనూ..జగన్ చేసిన వ్యాఖ్యలతో ఆ పార్టీ నాయకులకు వాయిస్ లేకుండా పోయింది. ప్రజలంతా ఒక దారిలో వెళ్తే.. జగన్ రివర్స్‌లో వెళ్తుండడంతో నాయకులు మౌనం పాటిస్తున్నారు. మరి వచ్చే కాలంలో అయినా మారుతారో లేదో చూడాలి.