గత ప్రభుత్వంలో జగన్ ఫొటోల, వైసీపీ రంగుల పిచ్చి గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడం మొదలు రైతుల పొలాల పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫొటో ముద్రించడం వరకు ఎన్నో ఉన్నాయి. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫొటోను తొలగించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా విజయవాడలో టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని భోగి మంటల్లో జగన్ బొమ్మ ఉన్న పాస్‌బుక్‌లను వేసి తగులబెట్టిన వైనం హాట్ టాపిక్ గా మారింది.
ప్రజల ఆస్తులకు సంబంధించిన పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ వేసుకుని దోపిడీ చేశారని చిన్ని ఆరోపించారు. తమ ప్రభుత్వంలో ఆ బొమ్మలను తొలగించి రాజముద్రతో పాస్‌బుక్‌లు జారీ చేశామన్నారు. జగన్ చేసిన పనికి నిరసనగా ఈ భోగి మంటల్లో జగన్ బొమ్మ ఉన్న పాస్‌బుక్‌లను కాల్చేశామని తెలిపారు.
మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంబంధించిన జీవోలను వైసీపీ ప్రభుత్వమే తెచ్చిందని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు ఆ జీవోలను వైసీపీ నేతలే భోగి మంటల్లో వేసి కాల్చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
విజయవాడ అభివృద్ధిని వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం చేసిందని, ప్రజలు నానా కష్టాలు పడ్డారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం హయాంలో బెజవాడను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. విజయవాడపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి పెద్ద ప్రాజెక్టులు చేపట్టారని అన్నారు.