తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిని నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మధ్య ప్రేమ వ్యహారం నడుస్తోందని, అందుకే ఆమెకు కీలక పోస్టింగులు వస్తున్నాయని ఎన్టీవీతో పాటు కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కథనాలు ప్రసారమైన సంగతి తెలిసిందే. అయితే, ఆ కథనంపై ఐఏఎస్ అధికారుల సంఘం మండిపడింది. ఆ కథనంపై పోలీసులకు కంప్లయింట్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆ వివాదాస్పద కథనంపై ఎన్టీవీ ఎడిటర్ బహిరంగ క్షమాపణ చెప్పారు. ఆ కథనం వల్ల ఎవరి మనోభావాలైన దెబ్బతిని ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నామని ప్రకటించారు.
ఐఏఎస్ అధికారుల సంఘం ఫిర్యాదుతో ఎన్టీవీతో పాటు మరో ఏడు డిజిటల్ మీడియా సంస్థలైన తెలుగు స్క్రైబ్, ఎంఆర్ మీడియా, ప్రైమ్9 తెలంగాణ, పీవీ న్యూస్, సిగ్నల్ టైమ్స్, వోల్గా టైమ్స్, మిర్రర్ టీవీ, టీన్యూస్ తెలుగులపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు జనవరి 12న కేసు నమోదు చేశారు.
మరోవైపు, ఎన్టీవీ తెలంగాణ ఇన్ పుట్ ఎడిటర్ ను ఈ రోజు ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకాక్ వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన రమేశ్ తో పాటు మరో ఇద్దరు ఎన్టీవీ జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, వారిని ఏ కేసులో అరెస్టు చేశారన్న విషయంపై స్పష్టత లేదు. ఐఏఎస్, మంత్రి కథనం నేపథ్యంలోనే వారిని అరెస్టు చేశారని ప్రచారం జరుగుతోంది.