కర్ణాటక రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి మారబోతున్నారంటూ కన్నడ నాట చాలాకాలంగా ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డీకే శివకుమార్ నర్మగర్భంగా పెడుతున్న ట్వీట్ లు వైరల్ గా మారుతున్నాయి. తాజాగా కర్ణాటకలో రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా సీఎం హాట్ సీట్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోనే డీకే శివకుమార్ తాజాగా చేసిన మరో ట్వీట్ వార్తల్లో నిలిచింది.
ప్రయత్నాలు విఫలమైనా...ప్రార్థనలు ఎప్పటికీ విఫలం కావంటూ డీకే తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ పై కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. రాహుల్ గాంధీ మైసూర్ టూర్ సందర్భంగా సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ లతో భేటీ అయ్యారు. సీఎం సీటు వ్యవహారం, అధికార పంపిణీ వ్యవహారంపై క్లారిటీ ఇవ్వాలని రాహుల్ గాంధీని సిద్ధూ కోరారని తెలుస్తోంది.
కాగా, 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రెండున్నరేళ్లపాటు సీఎంగా సిద్దరామయ్య, ఆ తర్వాత రెండున్నరేళ్లు సీఎంగా డీకే శివకుమార్ కొనసాగుతారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే రెండున్నరేళ్లు గడిచాయి కాబట్టి తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డీకే డిమాండ్ చేస్తున్నారట. అయితే ఐదేళ్లు తానే సీఎం అని సిద్ధరామయ్య చెబుతున్నారు. దీంతో, ఈ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పెద్దలు ప్రయత్నిస్తున్నారట.