దింపుడు కళ్లెం...ఈ మాట ఈతరం వారికి తెలియకపోవచ్చు. కానీ, పాత తరం మనుషులకు తెలుసు. ఎవరైనా మనిషి చనిపోతే...శవయాత్ర సమయంలో శ్మశానానికి కొద్ది దూరంలో ఒకసారి పాడెను దింపుతారు. అక్కడ చనిపోయిన వారి చెవిలో వారి కుటుంబ సభ్యులు ప్రేమగా వెనక్కు రావాలని పిలుస్తుంటారు. అలా పిలవగానే చనిపోయిన వారు తిరిగి వస్తారని వారి నమ్మకం. దానినే దింపుడు కళ్లెం ఆశ అంటారు. ఇప్పటికీ కొన్ని పల్లెటూళ్లలో ఈ దింపుకళ్లెం క్రతువు నడుస్తోంది.
తాజాగా మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో ఓ బామ్మ దాదాపు ఇదే తరహాలో పాడె మీద నుంచి బతికి బట్టకట్టింది. ప్రస్తుతం ఆ ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాగ్ పూర్ లో 103 ఏళ్ల బామ్మ గంగాబాయి చనిపోయిందని కుటుంబ సభ్యులు భావించారు. ఆ తర్వాత ముక్కులో దూది పెట్టి, కాలి వేళ్లకు ముడి కూడా వేశారు. అయితే, బామ్మ కాలివేళ్లు కదలడాన్ని ఆమె మనవడు గమనించాడు.
ఆ తర్వాత ముక్కులో దూది తీయగానే ఆమె శ్వాస తీసుకుంది. ఆ తర్వాత వైద్యులకు చూపించారు. ఆమె బాగానే ఉందని డాక్టర్లు నిర్ధారించారు. ఇక, అదే రోజు గంగాబాయి పుట్టిన రోజు కావడం విశేషం. దీంతో, అంతిమ యాత్రకు వచ్చిన బంధువులంతా ఆమె పుట్టిన రోజు కేక్ తిని వెళ్లారు. దీంతో, బామ్మకు ఈ భూమ్మీద ఇంకా నూకలున్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చచ్చి బతకడం అంటే ఇదే అంటున్నారు.