దృశ్యం...ఈ చిత్రం గురించి తెలియని భారతీయ సినీ అభిమానులుండరు అంటే అతిశయోక్తి కాదు. విలక్షణ చిత్రాలకు పెట్టింది పేరైన మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ దేశవ్యాప్తంగా ప్రశంసలందుకుంది. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్ నటించిన ఈ చిత్రం మలయాళ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
తమిళంలో కమల్ హాసన్, హిందీలో అజయ్ దేవగన్, తెలుగులో వెంకటేష్ లు ఈ చిత్రాన్ని రీమేక్ చేసి హిట్ కొట్టారు. అదే కోవలో తెరెక్కిన దృశ్యం-2 కూడా మలయాళం, తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది. దీంతో, దృశ్యం-3 ఎప్పుడు విడుదల కాబోతోంది అంటూ ఆ చిత్రం కల్ట్ ఫ్యాన్స్ తో పాటూ మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం విడుదల తేదీని అఫీషియల్ గా చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఈ ఏడాది ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ చిత్రం విడుదల కాబోతోందని మోహన్ లాల్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దృశ్యం-3...ది కంక్లూషన్ అని క్యాప్షన్ ఇవ్వడంతో ఇదే చివరి పార్ట్ అని కన్ఫర్మ్ అయింది. దీంతో, ఈ ఏడాది వేసవిలో మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఎండలతో పాటు ఈ ఫ్యామిలీ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ లో ట్విస్ట్ లతోనూ ఉక్కిరిబిక్కిరి కాక తప్పదు. తాజాగా విడుదల తేదీ రివీల్ కావడంతో తెలుగు, హిందీ కన్నా మలయాళంలో ఈ చిత్రం ముందుగా విడుదల కాబోతోందన్న విషయం కన్పర్మ్ అయింది.