ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం శరవేగంగా సాగుతోంది. దీంతో ఇక్కడ ప్రధాన కార్యక్రమాలు నిర్వహిం చే దిశగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వాస్తవానికి గత నెలలో జరిగిన విశాఖ పెట్టుబడుల సదస్సును కూడా అమరావతిలోనే నిర్వహించేందుకు ప్రయత్నాలు చేసింది. కానీ, కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు.. ఈ వేదికను విశాఖకు పరిమితం చేశారు. కానీ.. ఇప్పుడు రాష్ట్ర సర్కారు మరో కీలక ఘట్టంతో అమరావతిని ప్రచారంలోకి తీసుకువచ్చింది.
ఈ నెల 26న అంటే.. మరో ఆరు రోజుల్లో దేశ గణతంత్ర(రిపబ్లిక్) దినోత్సవం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి రాష్ట్రం నిర్వహించే అధికారిక గణతంత్ర దినోత్సవానికి అమరావతిని వేదికగా మార్చారు. ఇక్కడ సుమారు 12 ఎకరాల స్థలాన్నిచదును చేస్తున్నారు. నిర్విరామంగా పనులు రేయింబవళ్లు సాగుతు న్నాయి. ఇదేసమయంలో రాష్ట్ర పోలీసులు, ఇతర శాఖల రిజర్వ్ పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది.. రిహార్లల్స్ నిర్వహిస్తున్నారు.
ఇక, 2 వేల మంది అతిథులకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వేదికపై 100 మంది కూర్చుకునేందుకు వీలుగా నిర్మాణాలు సాగుతున్నాయి. గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు సహా.. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అదేవిధంగా విదేశీ ప్రతినిధులను కూడా ఆహ్వానించారు. వచ్చే వారికి టీ, కాఫీలతోపాటు.. మచ్చిగ, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశారు.
అమరావతిలో నిర్వహిస్తున్న అతి పెద్ద కార్యక్రమం ఇదేనని అధికారులు చెబుతున్నారు. దీనికి సాధారణ పౌరులు కూడా రావొచ్చని.. ఎలాంటి పాస్‌లు ఉండబోవని తెలిపారు. అయితే.. సంప్రదాయ దుస్తుల్లో రావాలని సూచిస్తున్నారు. గవర్నర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. సీఎం కీలక ప్రసంగం చేయనున్నారు. ఈ కార్యక్రమం నిర్వహణకు ప్రభుత్వం 25 కోట్ల రూపాయలను వెచ్చిస్తోందని అధికారులు తెలిపారు.