పాదయాత్ర...ఉమ్మడి ఏపీతోపాటు నవ్యాంధ్రప్రదేశ్ లోనూ బాగా సక్సెస్ అయిన ఫార్ములా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్, నారా లోకేశ్...వీరంతా పాదయాత్ర చేసిన తర్వాత జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టిన వారే. ఈ క్రమంలోనే అదే సక్సెస్ ఫార్ములాను జగన్ నమ్ముకున్నారు. మరోసారి పాదయాత్ర చేయబోతున్నానని జగన్ ప్రకటించారు.
ఏడాదిన్నర తర్వాత ఏలూరు నుంచి పాదయాత్ర మొదలుబెడతానని జగన్ సంచలన ప్రకటన చేశారు. ఏడాదిన్నర పాటు ప్రజల్లోనే ఉంటానని చెప్పారు. అంతేకాదు, ప్రతివారం ఒక్కో నియోజకవర్గంలో పర్యటించి అక్కడి కార్యకర్తలతో భేటీ అవుతానని చెప్పారు. ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి మొదటివారంలో బడ్జెట్ సెషన్స్ పెడుతున్నారని, కూటమి ప్రభుత్వానికి మిగిలింది మరో రెండు బడ్జెట్లు మాత్రమేనని జగన్ అన్నారు.
అయితే, గత పాదయాత్ర మాదిరిగా పాదయాత్ర 2.0 కూడా జగన్ కు అధికారం కట్టబెడుతుందా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఆ ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి. ఎందుకంటే, గతంలో జగన్ చేసిన పాదయాత్ర నాటి పరిస్థితులు నేడు లేవు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో కూటమి ప్రభుత్వం బలంగా ఉంది. వైసీపీ కేడర్ నైతిక స్థైర్యం దెబ్బతిని ఉంది. ప్రజల్లో వైసీపీకి గతంలో ఉన్న సానుభూతి లేదు. జగన్ విధ్వంసకర పాలన చూసిన ప్రజలకు జగన్ కు ఇంకో ఛాన్స్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు.