దుగ్గిరాల మర్డర్ మిస్టరీ.. బిర్యానీతో భ‌ర్త‌ను చంపి శవం ప‌క్క‌నే భార్య కిరాతకం!

admin
Published by Admin — January 22, 2026 in Andhra
News Image

గుంటూరు: వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు పెట్టడమే కాదు, ప్రాణాలు తీసే స్థాయికి దిగజారుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో వెలుగుచూసిన ఓ హత్యోదంతం సభ్య సమాజాన్ని విస్మయానికి గురిచేస్తోంది. కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి అత్యంత కిరాతకంగా చంపడమే కాకుండా, శవం పక్కనే కూర్చుని ఆ భార్య చేసిన పని వింటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. 

చిలువూరుకు చెందిన లోకం శివనాగరాజు ఉల్లిపాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే, విజయవాడలోని ఓ సినిమా థియేట‌ర్ లో టికెట్ కౌంటర్‌లో ప‌నిచేస్తున్న‌ అతని భార్య లక్ష్మీమాధురికి, సత్తెనపల్లికి చెందిన గోపి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అది అక్రమ సంబంధానికి దారితీసింది. తమ సుఖానికి అడ్డుగా ఉన్నాడని భావించిన మాధురి, భర్తను వదిలించుకోవాలని పక్కా స్కెచ్ వేసింది. ఈ నెల 18న రాత్రి భర్తకు ఇష్టమైన బిర్యానీ వండి, అందులో ఏకంగా 20 నిద్రమాత్రలను పొడి చేసి కలిపింది. అది తిన్న శివనాగరాజు స్పృహ కోల్పోయి గాఢ నిద్రలోకి జారుకున్నాడు.

శవం పక్కనే పోర్న్ వీడియోలు..!

భర్త అపస్మారక స్థితిలోకి వెళ్ళగానే, మాధురి తన ప్రియుడు గోపిని ఇంటికి పిలిపించుకుంది. ఇద్దరూ కలిసి శివనాగరాజుపై దాడి చేశారు. గోపి ఛాతీపై కూర్చోగా, మాధురి దిండుతో ముఖాన్ని అదిమి పట్టి ఊపిరాడకుండా చేసి చంపేసింది. అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే.. భర్త చనిపోయిన తర్వాత ప్రియుడు అక్కడి నుంచి వెళ్ళిపోగా, మాధురి ఏమాత్రం భయం లేకుండా తెల్లవార్లూ భర్త శవం పక్కనే కూర్చుని తన మొబైల్‌లో పోర్న్  వీడియోలు చూస్తూ గడిపింది.

తెల్లవారుజామున 4 గంటలకు తన భర్తకు గుండెపోటు వచ్చిందని, నిద్రలోనే చనిపోయాడని చుట్టుపక్కల వారిని నమ్మించే ప్రయత్నం చేసింది. అంతా నిజమే అనుకుని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా, శివనాగరాజు స్నేహితులు అక్కడకు చేరుకున్నారు. మృతదేహం చెవి నుంచి రక్తం రావడం, ఒంటిపై గాయాలు ఉండటంతో వారికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

క‌ట్ చేస్తే రంగంలోకి దిగిన పోలీసులు బాడీని పోస్టుమార్టంకు పంప‌గా.. ఆ రిపోర్టులో అసలు నిజం బయటపడింది. శివనాగరాజు గుండెపోటుతో చనిపోలేదని, ఊపిరాడక పోవడం వల్ల, అలాగే పక్కటెముకలు విరగడం వల్ల‌ మరణించాడని తేలింది. దాంతో పోలీసులు మాధురిని తమదైన శైలిలో విచారించగా, ప్రియుడితో కలిసి చేసిన పాపాన్ని ఒప్పుకుంది. ప్రస్తుతం పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న స్థానికంగా తీవ్ర ఆందోల‌న రేకెత్తిస్తోంది.  

Tags
Duggirala Murder Crime News Guntur Crime Murder Mystery Andhra Pradesh News
Recent Comments
Leave a Comment

Related News