సాధారణంగా జైలుకు వెళ్తే చేసిన పాపాలకు పశ్చాత్తాపం పడతారని, లేదంటే కటకటాల వెనుక కాలం వెళ్లదీస్తారని అనుకుంటాం. కానీ రాజస్థాన్‌లోని ఈ ప్రేమ పక్షులు మాత్రం జైలును ఒక డేటింగ్ స్పాట్‌గా మార్చేశాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
పెళ్లి కూతురు ప్రియ సేథ్(33) సామాన్యురాలు కాదు, హనీట్రాప్‌లో ఆరితేరిన ఘనాపాటి. ఒక వ్యక్తిని ప్రేమ వలలో దించి దారుణంగా హత్య చేసిన కేసులో ఆమె యావజ్జీవ శిక్ష అనుభవిస్తోంది. ఇక పెళ్లికొడుకు హనుమాన్ ప్రసాద్ అలియాస్ జాక్ మరో అడుగు ముందుకేసి, ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని అంతం చేసిన రికార్డు ఉంది. వినాశకాలే విపరీత బుద్ధి అన్నారో లేదో కానీ, ఈ ఇద్దరు కిల్లర్ల మనసులు మాత్రం జైలు గోడల మధ్య ఐక్యమయ్యాయి. బహుశా ఒకరి క్రైమ్ హిస్టరీ చూసి మరొకరు ఫిదా అయిపోయారేమో.
ఏడాది క్రితం వీరిని జైపూర్ సెంట్రల్ జైలు నుండి ఓపెన్ జైలుకు మార్చడమే వీరికి కలిసొచ్చింది. అక్కడ పరిచయం కాస్తా ఆరు నెలల్లోనే గాఢమైన ప్రేమగా మారిపోయింది. గత నాలుగు నెలలుగా జైలు ఆవరణలోనే వీరు సహజీవనం కూడా చేస్తున్నారంటే, అక్కడ కట్టుదిట్టమైన శిక్షలు ఎలా అమలవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఆ విషయం పక్కన పెడితే.. ఈ జంట హంతుకులు ఇప్పుడు పెళ్లి బంధంతో ఒకటి కావాలని నిర్ణయించుకున్నారు. అందుకు తమ పెద్దలను ఒప్పించడమే కాక.. ఏకంగా తమ పెళ్లి పత్రికను గత డిసెంబర్‌లో రాజస్థాన్ హైకోర్టుకు సమర్పించి `మా పెళ్లికి పెరోల్ ఇవ్వండి మహాప్రభో` అని వేడుకున్నారు. కోర్టు కూడా ఆ ఖైదీల కళ్యాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో పెరోల్ సలహా కమిటీ వారికి పెరోల్ మంజూరు చేసింది.
చిత్రమేమిటంటే, వీరు గతంలో ఎవరితో కలిసి హత్యలు చేశారో, ఆ పాత భాగస్వాములు కూడా ప్రస్తుతం జైల్లోనే ఊచలు లెక్కపెడుతున్నారు. వారిని గాలికి వదిలేసి, వీరు మాత్రం పెరోల్ మీద బయటకొచ్చి అల్వార్‌లో మూడు రోజుల పాటు అట్టహాసంగా పెళ్లి చేసుకుంటున్నారు. హత్యలు చేసి జైలుకు వెళ్తే ఇలాంటి వింత ప్రేమకథలు కూడా పుట్టుకొస్తాయా అని స్థానికులు నోరెళ్లబెడుతున్నారు. మరోవైపు నెట్టింట ఈ వింత ప్రేమ కథ వైరల్‌గా మారడంతో.. `జైలుకెళ్లింది శిక్ష అనుభవించడానికా? లేక పెళ్లి సంబంధాల కోసమా?` అంటూ నెటిజన్లు ఘాటుగా సెటైర్లు పేలుస్తున్నారు.