వైసీపీ అధినేత జగన్ ఒక వైపే చూస్తున్నారా? ఆయన ఆలోచన కూడా ఒకవైపు గానే సాగుతోందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. కేవలం సంక్షేమాన్ని.. తన పాలనలో జరిగిన బటన్ నొక్కుళ్లను మాత్ర మే ఆయన పరిశీలనగా చూస్తున్నారు తప్ప.. వాస్తవిక ధోరణితో నాణేనికి రెండోవైపున జరిగిన .. జరుగుతు న్న పరిణామాలను ఆయన పరిశీలించడం లేదన్నది ప్రస్తుతం వైసీపీలోనే వినిపిస్తున్న వాదన.
1) తన పాలన
తన పాలన బాగుందని.. ఇప్పుడు భ్రష్టు పట్టిందని జగన్ చెబుతున్నారు. ముఖ్యంగా రైతులు, విద్యా వ్యవస్థ, మహిళలకు, ఇతర సామాజిక వర్గాలకు చేసిన మేళ్లు వంటివి జగన్ గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూటమి సర్కారు వీటిని విస్మరించిందని ఆయన అంటున్నారు. అందుకే తనపై అపారమైన ప్రేమ పెరుగుతోందని కూడా అంటున్నారు. ఇది తనకు లాభిస్తుందని.. వచ్చే ఎన్నికల్లో విజయానికి దోహదపడుతుందనికూడా పేర్కొంటున్నారు.
వాస్తవం ఏంటి?
కానీ, వాస్తవానికి జగన్ హయాంలో రైతులు, మహిళలకు.. అదేవిధంగా విద్యావ్యవస్థకు ఎలాంటి మేళ్లు చేశారో.. ఇప్పుడు కూడా అవి కొనసాగుతున్నాయి. కూటమి సర్కారు 1నే పింఛన్లు ఇస్తోంది. తల్లికి వందనం పేరుతో రూ.15 వేలు ఇస్తోంది. రైతులకు అన్నదాత కింద ఇన్ పుట్ సబ్సిడీ కూడా ఇస్తోంది. తేడా ఎక్కడా లేదు. అయితే.. లబ్ధి దారుల సంఖ్యలో ఎప్పుడూ ఉండే తేడానే ఇప్పుడు కూడా కొనసాగుతోంది. నాడు కొందరు తగ్గారు.. మరికొందరుపెరిగారు ఇప్పుడు కూడా అదే జరుగుతోంది.
2) వ్యతిరేకత
వైసీపీ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగింది. ఇది వాస్తవం. పథకాలు తీసుకున్నవారు.. లబ్ధి పొందిన వారు కూడా ఓటు వేయలేదని.. సాక్షాత్తూ రిజల్ట్ వచ్చిన రోజే జగన్ వ్యాఖ్యానించారు. దీనికి కారణం ఏంటనేది ఆయన విశ్లేషించుకుని ఉంటే బాగుండేది. కానీ, ఈవీఎంలపై నెపంమోపి మౌనం పాటించారు. కానీ.. నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం కనుక చేస్తే.. వైసీపీ తప్పులు బయట పడేవి.
వాస్తవం ఏంటి?
వైసీపీ హయాంలో బటన్ నొక్కుడుకే పరిమితం అయ్యారు. రహదారుల అభివృద్ధిని విస్మరించారు. ఇది ప్రజలకు మంటపుట్టించింది. మద్యం ధరలను ఆకాశానికి అంటేలా చేశారు. కానీ, తాగుడు మాన్పించలేక పోయారు. ఇలా.. నాడు జరిగిన తప్పులు తెలుసుకోవాలి. ఇక, ఇప్పుడు కూడా రప్పా-రప్పా డైలాగులు.. పొట్టేళ్ల తలలు నరకడం.. వంటివి ప్రజల్లో వైసీపీని రప్పా.. రప్పా పార్టీగానే నిలబెడుతున్నాయి.. తప్ప వైసీపీకి గ్రాఫ్ పెంచడం లేదు. ఈ రెండో కోణంపై జగన్ దృష్టి పెట్టకపోవడం గమనార్హం.