ఏపీ రాజధాని అమరావతి పరుగు లంఖించుకుందా? పనుల్లో వేగం మరింత పెరిగిందా? రెండో దశ రాజ ధాని విస్తరణకు కూడా మార్గం సుగమం అయిందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా రెండో దశ భూసేకరణ వ్యవహారం ఒకవైపు సాగుతుండగా.. మరోవైపు.. పనులకు సంబంధించిన పురోగతి కూడా కనిపిస్తోంది. 2015-18 మధ్య సమీకరించిన.. భూముల్లో తొలిదశ రాజధాని పనులను ప్రస్తుత ప్రభు త్వం వేగం పెంచింది.
ఇటీవలే హైకోర్టు పనులు కూడా దాదాపు పూర్తయ్యే దశకుచేరుకుంటున్నాయి. మరోవైపు ఏపీ సీఆర్ డీఏ సహా ప్రధాన మునిసిపల్ కార్యాలయం పనులు కూడా పూర్తికావడం.. అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడు రెండో దశ భూ సమీకరణ పనులు ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు రెండో దశ రాజధాని విస్తరణకు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను రూపొందించేందుకు సీఆర్ డీఏ అధికారులు టెండర్లు పిలిచారు.
ఇది అంతర్జాతీయ టెండర్. అంటే.. దేశంలోనే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంస్థలు ఈ టెండర్ల లో పాల్గొనే అవకాశం కల్పించారు. గతంలో తొలిదశ పనులకు సింగపూర్‌కు చెందిన సుర్బానా-జురాంగ్ అనే కంపెనీ టెండర్లు దక్కించుకుంది. ఆ కంపెనీ ఇచ్చిన మాస్టర్ ప్లాన్ ప్రకారమే ప్రస్తుతం తొలిదశ పనులు ముందుకు సాగుతున్నాయి. ఇక, ఇప్పుడు రెండో దశ మాస్టర్ ప్లాన్ కూడాఈ సంస్థకే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.
అయితే.. నిబంధనల ప్రకారం.. అంతర్జాతీయ టెండర్లు పిలిచారు. దీనిలో విజేతలైన కంపెనీకి రెండో దశలో రాజధాని అభివృద్ధి పనులను అప్పగించనున్నారు. 2028 నాటికి తొలిదశ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు రెండోదశ పనులకు కూడా టెండర్లను ఖరారు చేయడం ద్వారా.. 2027-28 మధ్య బడ్జెట్ కేటాయించి.. ప్రజల అభిప్రాయాలను కూడా తీసుకుని రెండో దశ పనులను కూడా ప్రారంభించనున్నారు. ఇక, రెండో దశ భూ సమీకరణ కూడా వేగంగా ముందుకు సాగుతోంది.