లేనిపోని సమస్యలు తెచ్చిపెట్టే పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకంపై చంద్రబాబు ప్రభుత్వం ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. రూ.82 వేల కోట్ల భారీ వ్యయంతో గోదావరి జలాలను బనకచర్ల రెగ్యులేటర్ వరకు తరలించి రాయలసీమకు సాగు, తాగునీటిని ఇవ్వాలన్న సీఎం చంద్రబాబు నిర్ణయం అభినందించదగినదే. కానీ అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు..? జాతీయ హోదా కలిగిన పోలవరం ప్రాజెక్టుకు నిధులివ్వడానికే మోదీ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. దీనికితోడు తెలంగాణ గుడ్డిగా దీనిని వ్యతిరేకిస్తోంది.
సముద్రంపాలవుతున్న వరదనీటినే తీసుకుంటామని చెబుతున్నా.. రాజకీయ కారణాలతో అక్కడి పాలకులు ససేమిరా అంటున్నారు. గోదావరి జలాలను కృష్ణా నదిలోకి తీసుకొస్తే కృష్ణా జలాల్లో తమ వాటా పెంచాలని కర్ణాటక, మహారాష్ట్ర కూడా అడుగుతున్నాయి. అన్నిటికీ మించి.. గోదావరి నీరు అందుతుందన్న సాకుతో కృష్ణా జలాల్లో ట్రైబ్యునల్ ఏపీ వాటాలో కోతపెడితే పూడ్చుకోలేని నష్టం జరుగుతుంది. మొదట మొగ్గుచూపిన కేంద్రం కూడా చివరకు వరద నీటి లభ్యత లెక్కలు అడిగింది. దాంతో ప్రాజెక్టును పక్కనపెట్టేశారు.
అయితే మొత్తంగా పక్కన పెట్టడం కాకుండా.. దానిని నల్లమలసాగర్ వరకు పరిమితం చేస్తే.. పై రాష్ట్రాలకు అభ్యంతరం ఉండదని నిపుణులు చెప్పడంతో తిరిగి దీనిపై ప్రభుత్వం కసరత్తు చేసింది. పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకం స్థానంలో పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుకు కార్యాచరణ సిద్ధం చేసింది. అంచనా వ్యయాన్ని రూ.58,700 కోట్లకు తగ్గించి దీనిని చేపట్టాలని రాష్ట్ర జల వనరుల శాఖ నిర్ణయించింది. పోలవరం నుంచి బొల్లాపల్లి రిజర్వాయరుకు.. అక్కడి నుంచి నల్లమలసార్‌కు గోదావరి వరద జలాలను ఎత్తిపోయడం దీని ఉద్దేశం.
రోజుకు రెండు టీఎంసీల చొప్పున 100 రోజుల పాటు 200 టీఎంసీల వరద నీటిని తరలించాలని భావిస్తున్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మూసీ, మన్నేరు బేసిన్ల పరిధిలో కొత్తగా ఏడు లక్షల ఎకరాలకు నీరివ్వడమే గాక.. వెలిగొండ, గుండ్లకమ్మ, ఇతర చిన్న ప్రాజెక్టుల పరిధిలోని 6 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని.. 60 లక్షల మందికి తాగునీరు, పరిశ్రమలకు 20 టీఎంసీల నీరు సరఫరా చేయాలనేవి కొత్త పథకం లక్ష్యాలు.
ఎట్టకేలకు టెండర్లు..
నల్లమలసాగర్ వరకే ప్రాజెక్టును పరిమితం చేసినా.. ఇబ్బందులు లేవని కాదు. తెలంగాణ తన వ్యతిరేకత కొనసాగించక మానదు. ఎందుకంటే ఏపీ ఏ ప్రాజెక్టును తలపెట్టినా అడ్డుకోవడం అక్కడి పాలక, ప్రతిపక్షాలకు రివాజుగా మారింది. ఆ రాష్ట్రంలో కేసీఆర్ హయాంలో అక్రమ ప్రాజెక్టులు నిర్మించినా ఏపీ ప్రభుత్వాలు అభ్యంతరపెట్టలేదు. అయినా వారి తీరు మారడం లేదు.
అయినా నల్లమలసాగర్‌పై ముందడుగు వేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. దీంతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపకల్పనకు ఆసక్తిగల సంస్థలను ఆహ్వానిస్తూ జల వనరుల శాఖ తాజాగా టెండర్లు పిలిచింది. నవంబరు 11వ తేదీలోపు బిడ్లు సమర్పించాల్సి ఉంటుంది. వాటిని పరిశీలించి వచ్చే ఏడాది జనవరి నెలాఖరుకల్లా టెండర్లు ఖరారు చేస్తారు.
తయారుచేసిన డీపీఆర్‌ను కేంద్ర జల సంఘం పరిశీలనకు పంపుతారు. మార్చి నెలాఖరులోగా సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ఆమోదం, ఏప్రిల్ నెలాఖరులోగా కేంద్ర జలశక్తి, అటవీ పర్యావరణ శాఖల ఆమోదం కూడా తీసుకోవాలని ప్రభుత్వం సంకల్పించింది. గోదావరికి వరదల సమయంలో.. వరద నీటిని పోలవరం కుడి కాలువ నుంచి ఇప్పటికే నిర్మించిన ఓపెన్ కెనాల్ ద్వారా తరలిస్తారు.
ఈ జలాలను గోదావరి ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం వద్ద అక్విడెక్టును నిర్మించి నాగార్జున సాగర్ కుడి కాలువలో ఎత్తిపోయాలని మొదట భావించారు. ఇలా అక్విడెక్టును నిర్మిస్తే రూ.1,500 కోట్ల అదనపు వ్యయమవుతుందన్న ఉద్దేశంతో.. అక్విడెక్టు ద్వారా కాకుండా బుడమేరు కాలువ ద్వారా పవిత్ర సంగమం వద్ద కృష్ణా నదిలోకి పంపితే గోదావరి ట్రైబ్యునల్ ఆదేశాలు వర్తించే ఆస్కారం లేదని నిపుణులు సూచించారు. దీంతో.. అక్విడెక్టును నిర్మించకుండానే కృష్ణా నదిలోకి రోజుకు 2 టీఎంసీల చొప్పున తరలించాలని ప్రభుత్వం అనుకుంటోంది.
ప్రాజెక్టు తొలిదశను రూ.13,800 కోట్లు, రెండోదశను రూ.35,750 కోట్లు, మూడో దశను 9,150 కోట్లతో.. మొత్తంగా రూ.58,700 కోట్లతో పూర్తి చేయాలని ప్రతిపాదిస్తోంది. పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకం కోసం తయారు చేసిన హైడ్రాలజీ రిపోర్టును, ముందస్తు సాధ్యాసాధ్యాల నివేదిక (పీఎఫ్‌ఆర్)ను కూడా రాష్ట్రప్రభుత్వం ఇదివరకే జల సంఘానికి పంపింది. దీనిపై తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో నల్లమలసాగర్ వరకే వరద నీటిని ఎత్తిపోయాలని నిర్ణయించింది.
తాజా స్కీంతో తెలంగాణ సహా ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టమూ ఉండదని నిపుణులు చెబుతున్నారు. దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ వాడుకునే వరద జలాలతో ఎగువనున్న ఈ రాష్ట్రాలకు ఇబ్బంది ఉండదని స్పష్టం చేస్తున్నారు. ధవళేశ్వరం నుంచి ఏటా 3,000 టీఎంసీలు సముద్రంలో వృధాగా కలుస్తున్నాయని.. ఈ ఏడాది ఇప్పటికే దాదాపు 4,500 టీఎంసీల వరద కడలిపాలైందని గుర్తుచేస్తున్నారు. కేవలం వరద సమయంలోనే రోజుకు రెండు టీఎంసీల చొప్పున నల్లమలసాగర్‌కు తరలిస్తారని చెబుతున్నారు.