ప్రియురాళ్ల పగ: ఒకచోట వైరస్ ఇంజెక్షన్ తో దాడి.. ఇంకో చోట ఇంటినే తగలబెట్టేసింది

admin
Published by Admin — January 26, 2026 in Andhra
News Image

భార్యల్ని భర్తలు ప్లాన్ చేసి చంపేసే ఉదంతాలు అప్పుడు.. ఇప్పుడు జరుగుతూనే ఉన్నా.. గడిచిన కొంతకాలంగా వేరే వారి మోజులో పడి.. కట్టుకున్న భర్తను నిర్మోహమాటంగా.. నిర్దాక్షిణ్యంగా హతమారుస్తున్న భార్యల ఉదంతాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు ప్రియురాళ్ల వంతు వచ్చింది. గతంలో మోసం చేసిన ప్రియుడి తీరుకు కన్నీళ్లతో తమను తాము శిక్షించుకునే దగ్గర నుంచి మౌనపోరాటాల వరకు చూశాం. మారిన కాలానికి అనుగుణంగా.. ప్రియురాళ్లు మారుతున్నారు. అయితే.. అభ్యంతరమంతా వారు క్రైంసీన్ లోకి ఎంటర్ అయి.. జైలుపాలు అవుతున్నారు.

రోజు వ్యవధిలో ఏపీలో వెలుగు చూసిన ఈ రెండు ఉదంతాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ రెండుచోట్ల పగతో రగిలిపోతూ.. ఏదోలా ప్రియుడి ఫ్యామిలీకి తీరని నష్టం వాటిల్లేలా చేయాలన్న కసి వారిలో కనిపిస్తుంది. సంచలనంగా మారిన ఈ రెండు ఉదంతాల్లోకి వెళితే.. దూరం పెట్టిన ప్రియుడికి షాకిచ్చేందుకు.. అతడి భార్య ప్రాణం పోయేలా ప్లాన్ చేసిన ప్రియురాలి ఉదంతం కర్నూలు పట్టణంలో చోటు చేసుకుంది. కర్నూలు పట్టణానికి చెందిన ఒక డాక్టర్.. స్థానికంగా ఉండే వసుంధర అనే మహిళతో సన్నిహితంగా ఉండేవాడు. అయితే.. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సదరు వైద్యుడు.. వసుంధరను నిర్లక్ష్యం చేయటం మొదలు పెట్టాడు.

దీంతో వైద్యుడి ఫ్యామిలీ మీద పగ పెంచుకున్న వసుంధర.. దుర్మార్గమైన ప్లాన్ వేసింది. టూవీలర్ మీద వెళుతున్న వైద్యుడి భార్యను బండి మీద నుంచి పడిపోయేలా చేసింది. అలా రోడ్డు మీద పడిన ఆమెకు సాయం చేస్తున్నట్లుగా నటిస్తూ ముగ్గురు వ్యక్తులు ఆమెను ఆటో ఎక్కించారు. అప్పటికే ఆ ఆటోలో ఉన్న వసుంధర ఆమెపై వైరస్ ఇంజెక్షన్ తో దాడికి దిగింది. బాధితురాలు గట్టిగా కేకలు వేయటంతో వారంతా అక్కడి నుంచి పారిపోయారు.

బాధితురాలు వెంటనే ఆసుపత్రిలో చేరటం.. అక్కడి వైద్యులు ఆమెకు సరైన చికిత్స చేయటంతో పెను ప్రమాదం తప్పింది. జరిగిన ఉదంతంపై ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేయటంతో.. సీసీ కెమేరా ఫుటేజితో నిందితుల్ని గుర్తించి అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా గుంటూరు జిల్లా చేబ్రోలులో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. తనను ప్రేమించి.. తనను పెళ్లి చేసుకోకుండా వేరే వారిని పెళ్లి చేసుకున్నారన్న కోపంతో ఒక మహిళ.. ప్రియుడి ఇంటికి నిప్పు పెట్టిన షాకింగ్ ఉదంతం తాజాగా చోటు చేసుకుంది.

ఈ ఉదంతంలో ప్రియుడి ఇల్లు తగలబడింది. పెట్రోల్ పోసి ఇంటిని తగలబెట్టే వేళలో.. ప్రియుడి భార్యతో పాటు.. కుటుంబసభ్యులు ఉన్నట్లు చెబుతున్నారు. వెంటనే స్పందించటంతో ప్రాణాలకు ముప్పు తప్పిందని.. ఈ ఉదంతంలో గాయాలైనట్లుగా పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఉదంతాలు స్థానికంగా సంచలనంగా మారాయి.

Tags
Crime News Andhra Pradesh Girlfriend Revenge Kurnool Guntur
Recent Comments
Leave a Comment

Related News