తుఫానుల ముప్పే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అనేక అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ముఖ్యంగా ఉప గ్రహాలకు సంబం ధించిన విషయాలను పూసగుచ్చినట్టు.. అత్యంత విశ్వసనీయ సమాచారం అందించే సంస్థ.. అమెరికాకు చెందిన నేషనల్ ఏరో నాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్.. నాసా. 1958 నుంచి నాసా ప్రపంచ దేశాలకు అంతరిక్ష సేవలు అందిస్తోంది. అదేసమయంలో తొలిసారి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని కూడా నిర్మించింది. అనేక మంది వ్యోమగాములు సైతం అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన వారే.
మన భారత్‌కు చెందిన శుభాంషు శుక్లా సైతం.. ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపి వచ్చాడు. అలాంటి సంస్థ.. ఇప్పుడు సంచలన ప్రకటన చేసింది. మరో నాలుగు సంవత్సరాల్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని కూల్చేయనున్నట్టు తాజాగా వెల్లడించింది. దాదాపు 30 ఏళ్లుగా పరిశోధనలకు నిలయంగా ఉన్న ఈ భారీ కేంద్రాన్ని 2031 ప్రారంభంలో పసిఫిక్ మహాసముద్రంలో కూల్చివేయనున్నట్టు నాసా ప్రకటించింది. అంతరిక్ష కేంద్రం.. భూ వాతావరణంలోకి ప్రవేశించి, మంటల్లో కాలిపోతూ సముద్ర గర్భంలో కలిసిపోనుందని ఓ ప్రకటనలో తెలిపింది.
ఎందుకు కూల్చేస్తున్నారు..
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కేవలం అమెరికా మాత్రమే కాకుండా.. రష్యా, కొన్ని యూరప్ దేశాలు, జపాన్ సహా కెనడాలు భాగస్వాములుగా ఉన్నాయి. 1998లో ప్రారంభించిన అంతరిక్ష కేంద్రం అత్యంత స్వల్ప సమయం అంటే 2 ఏళ్లలోనే ప్రపంచానికి సేవలు అందించేందుకు రెడీ అయింది. 2000 సంవత్సరం నుంచి ఆస్ట్రోనాట్స్ దీనిలో ఉంటూ.. ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలు చేశారు. అయితే.. ముందుగానే నిర్మించిన లక్ష్యం ప్రకారం.. ఈ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం 2025తోనే కాలం తీరింది. అయితే..మరో ఐదేళ్ల పాటు దీని సామర్థ్యాన్ని పెంచారు. 2030 తర్వాత.. ఇది సామర్థ్యం కోల్పోనుంది. ఈనేపథ్యంలోనే నాసాలో భాగస్వామ్యదేశాలు.. దీని కూల్చివేతకు నిర్ణయించాయి.