ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా విచారణకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ రెండోసారి నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, 160 సీఆర్పీసీ నిబంధనల ప్రకారం కేసీఆర్ చిరునామా నందినగర్ అని, కాబట్టి అక్కడే విచారణకు సిద్ధంగా ఉండాలని సిట్ అధికారులు నోటీసుల్లో స్పష్టం చేశారు. అయితే, ప్రస్తుతం ఎర్రవెల్లిలోని ఫాం హౌస్ లో కేసీఆర్ నివాసముంటున్నారని, కాబట్టి అక్కడే విచారణ చేయాలని కేసీఆర్ తరపు న్యాయవాదులు అంటున్నారు.
ఈ క్రమంలోనే విచారణకు హాజరు కావాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. అంతేకాదు, కేసీఆర్ కు నోటీసులిచ్చినందుకు నిరసనగా రేపు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలపాలని పార్టీ పిలుపునిచ్చింది. వేలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ భవన్ కు రావాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది.
సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం ఒక కేసు విచారణలో సాక్షిగా ఉన్న వ్యక్తి నగర పరిధిలో ఉన్న ఒక ప్రాంతాన్ని ఎంచుకోవాల్సిన అవసరం లేదని కేసీఆర్ తరఫు న్యాయ నిపుణులు వాదిస్తున్నారు. సాక్షి నివాసం ఉంటున్న ప్రాంతానికి అధికారులు వచ్చి విచారణ జరపాలని చెబుతున్నారు. కేసీఆర్ విచారణకు వస్తున్నారు కాబట్టి..నంది నగర్ లోనే విచారణ జరిగే అవకాశముంది.
మరోవైపు, కేసీఆర్ కు సిట్ నోటీసులపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా కేసీఆర్‌ను ఏమీ పీకలేరని విమర్శిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టేందుకే కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చారని ఆరోపిస్తున్నారు. సింగరేణి బొగ్గు స్కాం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఇలా సిట్ నోటీసులంటూ డ్రామాలాడుతున్నారని విమర్శిస్తున్నారు.